logo

ఇళ్ల సమస్యలపై సమర భేరి

విజయవాడ నగర పరిసరాల్లో టిడ్కో ఇళ్లు, జగనన్న గృహాల సమస్యల పరిష్కారంపై సమర భేరి మోగింది. సీపీఐ, సీపీఎం, తెదేపా వేర్వేరుగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై స్పందన వేదికగా గూడు కోసం.. తమ గోడు వినిపించారు.

Published : 07 Feb 2023 03:26 IST

మాట్లాడుతున్న జి.కోటేశ్వరరావు, చిత్రంలో సి.హెచ్‌.కోటేశ్వరరావు, దుర్గా భవానీ, దుర్గాంబ తదితరులు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విజయవాడ నగర పరిసరాల్లో టిడ్కో ఇళ్లు, జగనన్న గృహాల సమస్యల పరిష్కారంపై సమర భేరి మోగింది. సీపీఐ, సీపీఎం, తెదేపా వేర్వేరుగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై స్పందన వేదికగా గూడు కోసం.. తమ గోడు వినిపించారు. పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి, వాటిని లబ్ధిదారులకు అందజేయాలని, జగన్న ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని కోరుతూ.. సీపీఐ నగర, జిల్లా కమిటీలు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపాయి. కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్‌.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు ఎలాంటి రుసుము లేకుండా అందజేస్తామని ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ హామీ ఇచ్చారని, మూడున్నర ఏళ్లు గడిచినా సదరు హామీ నెరవేరలేదన్నారు. వీటిని ఈనెల 22వ తేదీలోగా స్వాధీన పరచకుంటే.. తీవ్ర స్థాయిలో ఉద్యమించనున్నట్టు హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. గృహ నిర్మాణాలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 22న వేలాది మంది లబ్ధిదారులతో మహా ధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నాయకులు లంక దుర్గారావు, పెన్మెత్స దుర్గాభవానీ, మూలి సాంబశివరావు, పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.


పాతపాడులో  స్థలాలు వద్దు

విజయవాడ గ్రామీణ మండలం పి.నైనవరం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు.. 8 కిలో మీటర్ల దూరంలోని పాతపాడులో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సరికాదని, తమ గ్రామంలోనే ఇవ్వాలని కోరుతూ విన్నవించారు. నైనవరంలో సరిపడా స్థలాలు ఉండగా, పాతపాడులో సమస్యాత్మక ప్రాంతంలో కేటాయించారని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్‌, కౌలు రైతు సంఘ నేత మాతంగి ఆంజనేయులు, వృత్తిదారుల సంఘం నాయకులు ఎస్‌.శ్రీనివాసరావు, సురేష్‌, జమున, రాణి తదితరులు పాల్గొన్నారు.


నున్నలో ఆగిన  పనులు

విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామ లేఔట్‌లో రామవరప్పాడు, నున్న గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 1360 గృహాలను నిర్మిస్తుండగా, ఇవి బేస్‌ మెంట్‌ స్థాయిలో ఉన్నాయని, మట్టి లేదా రబ్బీసుతో నింపడానికి 5 నెలల నుంచి పనులు ఆగినట్టు ఆ గ్రామ తెదేపా నేత దండు సుబ్రహ్మణ్యరాజు కలెక్టర్‌కు వివరించారు. పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని