logo

వెలంపల్లి మాటే వేదం

దుర్గగుడి ఆలయ పాలకవర్గం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం అంతా హడావుడిగా జరిగిపోయింది. ఛైర్మన్‌గా విజయవాడకు చెందిన కర్నాటి రాంబాబు, మరో 14 మంది సభ్యులుగా నియమితులయ్యారు.

Published : 08 Feb 2023 06:11 IST

దుర్గగుడికి కొత్త పాలకవర్గం నియామకం
ఉదయం ఉత్తర్వులు.. సాయంత్రం ప్రమాణ స్వీకారం

ఈనాడు, అమరావతి: దుర్గగుడి ఆలయ పాలకవర్గం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం అంతా హడావుడిగా జరిగిపోయింది. ఛైర్మన్‌గా విజయవాడకు చెందిన కర్నాటి రాంబాబు, మరో 14 మంది సభ్యులుగా నియమితులయ్యారు. పాలక వర్గం ఏర్పాటులో దేవాదాయ శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే  వెలంపల్లి శ్రీనివాస్‌ మాటే చెల్లుబాటు అయ్యింది. మొత్తం 15 మందిలో ఛైర్మన్‌తో సహా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నలుగురికి పదవులు లభించాయి. నగరంలో మధ్య, తూర్పు నియోజకవర్గాల నుంచి ఒకొక్కరికి అవకాశం లభించింది.

వివాదాలమయం

దుర్గగుడి నిత్యం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గతంలో ఒక సభ్యురాలు చీరను తస్కరించి వివాదంలో చిక్కుకున్నారు. మరో సభ్యురాలి వాహనంలో తెలంగాణ మద్యం లభించింది. దేవాలయంలో పెత్తనం చేయడం, ఉచిత దర్శనాలు, అమ్మవారికి వచ్చిన విలువైన చీరలను బహుమతులుగా స్వీకరించడం లాంటి వివాదాల్లో పలువురు చిక్కుకున్నారు. మంగళవారం  నియమితులైన కొంతమంది సభ్యులపై కూడా నేరారోపణలు ఉన్నాయి. కాల్‌మనీ కేసులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం, దౌర్జన్యం కేసులు ఉండగా, వాటిని ఇటీవల తొలగించుకుని క్లీన్‌ సర్టిఫికెట్‌ పొందినట్లు సమాచారం. ఛైర్మన్‌గా నియమితులైన కర్నాటి రాంబాబు గతంలో తెదేపా కార్యకర్తగా ఉండేవారు. తర్వాత వెలంపల్లి విధేయునిగా మారారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేనపై విమర్శలు సంధిస్తూ నేతల దృష్టిని ఆకర్షించారు.  గతంలో ఆయన వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు పలు ఫిర్యాదులు ఉన్నాయి.  పోలీసులు సస్పెక్టు షీట్‌ తెరిచేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఆయన అనుచరుడిపై రౌడీషీట్‌ తెరిచి తర్వాత మూసివేశారు. అందులో భాగంగా పోలీసుల విచారణకు పలుమార్లు పిలిచినట్లు తెలిసింది. స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న ఆయనపై ఇతర వివాదాలూ ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గం నుంచి బుద్దా రాంబాబు,  కట్టా సత్తయ్య, కేసరి నాగమణిలకు అవకాశం ఇచ్చారు. వీరిలో రాంబాబు.. వెలంపల్లికి వీర విధేయుడు. సభ్యుల్లోఎక్కువ మంది స్థిరాస్తి వ్యాపారులుగా ఉన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి ఎంపికైన చింతా సింహాచలం న్యాయవాది. ఒక్కరి పేరునే ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. తూర్పు నియోజకవర్గం వైకాపా ఇంఛార్జి దేవినేని అవినాష్‌ సిఫార్సుతో బచ్చు మాధవీకృష్ణకు పదవి వచ్చింది. ఇటీవల కృష్ణలంకలో జరిగిన ఘర్షణలో ఈమె కూడా ఉన్నారు. గడపగడపకూ కార్యక్రమంలో ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారని బాధితురాలు ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. జగ్గయ్యపేటకు చెందిన నంబూరి రవి సభ్యుడిగా నియమితులయ్యారు. గతంలో ఆయనపై ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఫిర్యాదు, దొంగనోట్ల చలామణీ ఆరోపణలు ఉన్నాయి. దొంగనోట్ల కేసులో పక్క రాష్ట్రం పోలీసులు తీసుకెళ్లి విచారణ చేశారు. జగ్గయ్యపేట నుంచి అల్లూరి కృష్ణవేణికీ అవకాశం లభించింది. ఇటీవల ఎమ్మెల్యే ఉదయభాను, వెలంపల్లి మధ్య వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇద్దరూ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చున్నారు. దేవిశెట్టి బాలకృష్ణ (తిరువూరు), చింకా శ్రీనివాస్‌(మైలవరం), అనుమోలు ఉదయలక్ష్మి(నందిగామ)లకు అవకాశం ఇచ్చారు. ఇతర జిల్లాల నుంచి రామసీత(తిరుపతి), ఎం.వెంకటేశ్వరరావు(పశ్చిమగోదావరి), వేదకుమారి(ఏలూరు), కల్యాణి(పల్నాడు) సభ్యులుగా నియమితులయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏడు నియోజవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు.

దేవాదాయ శాఖ మంత్రి ఏరి?

ప్రమాణస్వీకారం అంతా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగింది. అసలు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకే సమాచారం లేదని తెలిసింది. మంగళవారం ఉదయం ఉత్తర్వులు రావడం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయడం చకాచకా జరిగిపోయాయి. కోఆప్షన్‌ సభ్యుల నియామకం విషయంలో ‘అంతా మీ ఇష్టం సర్‌.. మీకు నచ్చినట్లు చేసుకోండి..!’ అంటూ ప్రజాప్రతినిధులనుద్దేశించి దుర్గగుడి ఈవో భ్రమరాంబ వ్యాఖ్యానించడం విశేషం. పాలక వర్గంలో ఎనిమిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. ఛైర్మన్‌ పదవి బీసీ వర్గానికి దక్కింది. విధేయత, సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం పాలకవర్గాన్ని నియమించారు.

కర్నాటి రాంబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని