logo

గుడివాడలో గలాటా

పోలీసులు నోటీసు ఇవ్వకుండా నాటకీయ పరిణామాల మధ్య సోమవారం అరెస్టు చేసిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.

Updated : 08 Feb 2023 06:25 IST

పూచికత్తుతో రావి విడుదల
న్యాయస్థానం వద్దకు భారీగా చేరుకున్న తెదేపా శ్రేణులు

రావిని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు

నెహ్రూచౌక్‌(గుడివాడ), గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: పోలీసులు నోటీసు ఇవ్వకుండా నాటకీయ పరిణామాల మధ్య సోమవారం అరెస్టు చేసిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. అదనపు జుడిషియల్‌ ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్‌ నాగలక్ష్మి విచారించి పూచీకత్తుపై విడుదల చేశారు. నాగవరప్పాడులోని నీటి పారుదల కాల్వ గట్టుపై నివాసముంటున్నవారి ఇళ్ల తొలగింపును రావి అడ్డుకొని వారికి కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు తొలగిస్తుండగా రావి వెంకటేశ్వరరావు, తెదేపా నాయకులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఒకటో వార్డు సచివాలయం అడ్మిన్‌ పేరే వెంకట ముత్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమాచారం లేకపోవడంతో రావి తెదేపా శ్రేణులతో కలిసి గూడూరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపి వస్తుండగా  పోలీసులు అడ్డుకొని అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి పమిడిముక్కల పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్దకు తెదేపా శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఓపీ చీటీ లేని వారిని ఆసుపత్రిలోకి రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం అదనపు జుడిషియల్‌ ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్‌ కోర్టుకు తరలించారు. అప్పటికే తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా కోర్టు ప్రాంగణానికి చేరుకోవడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఉభయ పక్షాలను విచారించిన న్యాయమూర్తి నాగలక్ష్మి ఇద్దరి పూచీకత్తు, షరతులతో రావిని విడుదల చేశారు. పట్టణంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా టియర్‌ గ్యాస్‌ వాహనంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. 144 సెక్షన్‌ అమలు చేశారు.

ఎనిమిది మందిపై కేసు

అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు తెదేపా నాయకులు దింట్యాల రాంబాబు, ముళ్లపూడి రమేష్‌, దాసు శ్యామ్‌ ప్రసాద్‌, వసంతవాడ దుర్గారావు, సర్కార్‌, పోలాసి ఉమామహేశ్వరరావు, షేక్‌ జానీషరీఫ్‌ తదితరులపై సెక్షన్‌ 353, 341, రెడ్‌ విత్‌ 149 కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విడుదల అనంతరం రావికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. పేదల పక్షాన పోరాడితే అక్రమ కేసులు బనాయిస్తారా? ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్‌బ్యాంకు ఛైర్మన్‌ పిన్నమనేని బాబ్జి, తెదేపా నాయకుడు వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని