logo

పొరుగు జిల్లాలో...వీధికెక్కిన వైకాపా విభేదాలు

సొంత నియోజకవర్గంలో కాదని మైలవరం వైకాపా నాయకులు పక్క జిల్లా గుంటూరుకు వెళ్లి పోట్లాడుకున్న వైనమిది.

Updated : 08 Feb 2023 06:12 IST

మంత్రి జోగి, ఎమ్మెల్యే వసంత వర్గీయుల వాదులాట

మైలవరం, న్యూస్‌టుడే: సొంత నియోజకవర్గంలో కాదని మైలవరం వైకాపా నాయకులు పక్క జిల్లా గుంటూరుకు వెళ్లి పోట్లాడుకున్న వైనమిది. రెండు వర్గాలుగా విడిపోయి మరీ వైకాపా జిల్లా కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌ ఎదుట వాగ్వాదానికి దిగి, పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

రెండ్రోజుల కిందట మంత్రి జోగి రమేష్‌ అనుచరుడు, ఇబ్రహీంపట్నానికి చెందిన నల్లమోతు మధుబాబు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను దుర్భాషలాడారు. దీనిపై సోమవారం నియోజకవర్గంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ఎమ్మెల్యే వర్గీయులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలో పట్టు సాధించాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే వర్గం ‘చలో సజ్జల’ కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తొలుత గొల్లపూడి, తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జలను కలిసేందుకు కార్లలో తాడేపల్లి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గుంటూరులోని వైకాపా కార్యాలయంలో ఉన్న జిల్లా కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌ వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ముద్రపడిన జి.కొండూరు జడ్పీటీసీ సభ్యుడు మందా జక్రధరరావు, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలి భర్త, జి.కొండూరు మండలానికే చెందిన మరో ఇద్దరు సర్పంచులు, పలువురు నాయకులున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండు

ఇదిలా ఉండగా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే వర్గీయులు మర్రి రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు వచ్చిన వారిలో ముఖ్యమంత్రిని దూషించిన వారు చాలామంది ఉన్నారంటూ జడ్పీటీసీ సభ్యుడు జక్రధరరావు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తరపున వ్యాఖ్యానించడం, ఇరు వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది. ఎమ్మెల్యే ఇచ్చిన సొమ్ముతో గెలిచిన వ్యక్తులు నీతులు మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో వాదనకు దిగడంతో, కల్పించుకున్న నాయకులు ఇరు వర్గాలను వేరుచేశారు. జరుగుతున్న పరిణామాలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే, రాజీనామాలు తప్పవంటూ పలువురు ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరించి బయటకు వచ్చేశారు.
పార్టీలో ఉంటూ ఎవరైతే తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో, వారే దుర్భాషలాడే స్థాయికి వెళ్లటాన్ని నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని