logo

మాతా శిశు మరణాల నివారణలో వైద్యుల పాత్ర కీలకం

జిల్లాలో మాతా శిశు మరణాలను నివారించడంలో వైద్యులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా ఆదేశించారు.

Published : 08 Feb 2023 06:11 IST

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో మాతా శిశు మరణాలను నివారించడంలో వైద్యులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం వైద్యారోగ్య, స్త్రీశిశు సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి కాన్పు ఆస్పత్రిల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీ ల్యాబ్‌లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సిజేరియన్‌ కాన్పులను నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆస్పత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మాతాశిశు మరణాలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలు, ఆస్పత్రుల్లో పరిశుభ్రత తదితర అంశాలపై సమీక్షించారు. తోట్లవల్లూరు కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని గత సమావేశంలో సూచించినా కనీసం మెమో ఇవ్వకపోగా, వివరణ కోరకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షల వల్ల ప్రయోజనం ఏముందంటూ వైద్యాధికారులను నిలదీశారు. ఇటీవల మరణించిన నలుగురు మహిళలకు అందించిన వైద్య సేవలపై ఆరా తీశారు. ముందు చికిత్స చేసిన వైద్యులను సమావేశానికి పిలవకుండా.. చివర్లో వైద్యం చేసిన రిఫరల్‌ ఆస్పత్రి వైద్యులను సమావేశానికి తీసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా వైద్యం చేసిన వారిని పిలవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి డా. గీతాబాయిని ప్రశ్నించారు. శస్త్రచికిత్స అనంతరం చనిపోయిన వారి కేసులను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మహిళలు మృతి చెందడానికి వైద్యులు చెప్పిన కారణాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై తరచూ ఆస్పత్రులో ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు