logo

‘పాత్రికేయులపై ప్రభుత్వం కక్ష సాధింపు’

ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులపై పదే పదే కేసులు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

Published : 09 Feb 2023 01:19 IST

మీడియా డైరీని ఆవిష్కరిస్తున్న శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు,

చావా రవి, చందు జనార్ధన్‌, చలపతిరావు తదితరులు

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే : ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులపై పదే పదే కేసులు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కొవిడ్‌ సమయంలో మరణించిన పాత్రికేయుకుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి జీవో విడుదల చేసి, అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ముద్రించిన మీడియా డైరీని బుధవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే పత్రికలపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టారో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పాత్రికేయులు కొవిడ్‌తో చనిపోతే.. వారి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి మానవత్వం రాష్ట్ర ప్రభుత్వంలో లేకపోవడం విచారకరమన్నారు. సమాజంలో మార్పు అనివార్యమైతే.. ఆ మార్పు ప్రజామోదం పొందేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందనే ఆశాభావం తనకు లేదని చెప్పారు. ఆరోగ్య కార్డులు, ఆరోగ్య బీమాకు డబ్బులు చెల్లించాలని అంటోందని, ఖజానా పరిస్థితి బాగోలేదని చెబితే.. భిక్షగా భావించి తామే నగదు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమ కోసం శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌తో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ యూనిట్‌ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, చావా రవి, చలపతిరావు, వసంత్‌, రమాణారెడ్డి, ఎన్‌.సాంబశివరావు, ఏచూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని