logo

కృత్రిమ కొరత... రైతులకు వాత!

మిరప పంటకు కొన్నాళ్లుగా పడుతున్న చీడతో రైతులు విలవిలలాడుతుంటే.. ఇదే అదనుగా పురుగు మందులకు కృత్రిమ కొరతను సృష్టిస్తూ కొంతమంది దశారులు అన్నదాతల జేబులు కొల్లగొడుతున్నారు.

Published : 09 Feb 2023 02:01 IST

బ్లాక్‌మార్కెట్‌లో మిరప తెగులు నివారణ మందులు
ఈనాడు, అమరావతి- విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

మిరప పంటకు కొన్నాళ్లుగా పడుతున్న చీడతో రైతులు విలవిలలాడుతుంటే.. ఇదే అదనుగా పురుగు మందులకు కృత్రిమ కొరతను సృష్టిస్తూ కొంతమంది దశారులు అన్నదాతల జేబులు కొల్లగొడుతున్నారు. మిరప పంటకు.. సోకుతున్న నల్లతామర, ఆకు ముడత నివారణకు కొన్ని మందులు ప్రస్తుతం బాగా పనిచేస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు.. రైతులు ఈ మందుల కోసం పోటీ పడి కొంటున్నారు. ఇదే అవకాశంగా చేసుకుని.. కొంతమంది డీలర్లు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎమ్మార్పీ ధరతో సంబంధం లేకండా తాము చెప్పినంత చెల్లిస్తేనే మందును ఇస్తామంటూ రైతులను దోపిడీ చేస్తున్నారు. అప్పులు చేసి మరీ ఈ పురుగు మందులను కొనుగోలు చేస్తూ.. గుల్లవుతున్నారు. జిల్లాలో ఏటా 45వేల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది మరింత మంది రైతులు ముందుకు వచ్చారు. అధిక మొత్తాలు చెల్లించి మరీ కౌలుకు భూములు తీసుకుని మిరప సాగు చేస్తున్నారు. మిరపకు కొన్నాళ్లుగా నల్లతామర, ఆకు ముడత విపరీతంగా సోకుతోంది. ఎలాగైనా పంటలను కాపాడుకునేందుకు పురుగు మందులపై ఆధారపడుతున్నారు. ఆర్థికంగా భారమైనప్పటికీ  పిచికారి మందులు కొనుగోలు చేస్తున్నారు.  అసలు ధరకు ఎక్కడా మందులు దొరకడం లేదని చెబుతూ.. బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సమయానికి మందులను పిచికారీ చేయకపోతే.. పంట నష్టపోవాల్సి ఉంటుందనే ఆందోళనతో రైతులు అప్పులు చేసి మరీ ఈ మందును బ్లాక్‌ మార్కెట్‌లో ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.

పువ్వుపై నల్లతామర పురుగు

ఒక సంస్థకు చెందిన మందు 34మిల్లీలీటర్లు రూ.1653 ఎమ్మార్పీ ధర ఉండేది. దీనిని ప్రస్తుతం రూ.2,250కి సదరు సంస్థ పెంచేసింది.  బ్లాక్‌మార్కెట్‌లో రూ.3500 వరకూ అమ్ముకుంటున్నారు. మిరప పంట పూత దశలో ఉన్నప్పుడు పత్రహరితాన్ని పూర్తిగా నల్లనల్లి పురుగు తినేస్తోంది. దీనివల్ల అత్యధిక శాతం మిరప తోటలు దెబ్బతింటున్నాయి. ఆకుముడత వైరస్‌, నల్ల తామర కూడా మరోవైపు పంటపై దాడి చేస్తున్నాయి. జిల్లాలోని గంపలగూడెం సహా పలు ప్రాంతాల్లో మిరప పంటకు భారీగా నష్టం వాటిల్లింది. అందుకే.. పురుగు మందులపై అధికంగా ఆధారపడుతున్నారు. కొన్ని మందులు సత్ఫలితాలు ఇస్తుండడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది.

మార్కెట్‌లో నకిలీ మందు..

గుంటూరులో ఈ మందుకు నకిలీ సైతం తయారు చేస్తూ..  కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు పంపిస్తున్నట్టు సమాచారం. ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి కేంద్రంగా ఈ దందా సాగుతోంది. గుంటూరులో తయారుచేసి ఆగిరిపల్లికి పంపించి.. అక్కడి నుంచి ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలోని రైతులకు సరఫరా చేస్తున్నారు. ఆగిరిపల్లి నుంచి కొంతమంది రైతులతో పెద్దఎత్తున పిచికారీ మందును పంపించి.. వారితోనే మిగతా వారికి పంపిణీ చేయిస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే.. సదరు రైతులు సైతం ఇరుక్కుపోతారు. జిల్లాలోని జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరుతో పాటు పలు ప్రాంతాల్లో ప్రస్తుతం మిరప అత్యధికంగా సాగుచేస్తున్నారు. ఇప్పటికే  వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. పురుగు మందుల వినియోగం వల్ల మరింత ఆర్థిక భారం పడుతోంది. బయట తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు విలవిలలాడుతున్నారు. ఒకవైపు అధిక ధరలు, మరోవైపు నకిలీ మందులతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ మిరప తెగులుకు మందును ప్రభుత్వమే సరఫరా చేస్తే తమ పంటలను కాపాడుకోవచ్చని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మందుల కొట్టుల నుంచి అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండడంతో వాళ్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తనిఖీలు నిర్వహిస్తున్నాం

మిర్చిలో నల్లతామర నివారణకు వినియోగించే పిచికారి మందును కృత్రిమ కొరత లేకుండా, అధిక ధరలు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా ప్రత్యేక స్క్వాడ్‌ బృందం ఏర్పాటు చేసి పురుగులు, ఎరువులు దుకాణాలను తనిఖీ చేయిస్తున్నాం. రైతులు కూడా తమవంతు సహకారం అందించాలి.

విజయభారతి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకురాలు, ఎన్టీఆర్‌ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని