ఇక జుజ్జూరు మండల కేంద్రం

సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం వీరులపాడు నుంచి మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ బుధవారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

Updated : 09 Feb 2023 06:33 IST

కేబినేట్‌ భేటీలో ఆమోదం
నాయకుల భిన్నాభిప్రాయాలు
వీరులపాడు, న్యూస్‌టుడే

జుజ్జూరు గ్రామం

సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం వీరులపాడు నుంచి మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ బుధవారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో. స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున టపాసులు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వీరులపాడులో ఆందోళనలు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. గత మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారని ప్రసార మాధ్యమాల్లో అప్పట్లో వార్తలు రావడంతో గత 55 రోజులుగా వీరులపాడు, దాని పరిసర గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంపై  మండి పడుతున్నారు. గత 35 ఏళ్లుగా మండల కేంద్రంగా ఉన్న వీరులపాడులో తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈవో, వెలుగు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ వైద్యశాల, పోలీస్‌ స్టేషన్‌ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు గ్రామస్థులు ఉదారంగా తమ భూములను ఇచ్చారని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని  పోరాట కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మండల వ్యవస్థ ప్రవేశ పెట్టిన తొలి రోజుల్లో మండల కేంద్రంగా అనుకూలతలున్న గ్రామాలుగా జుజ్జూరు, వీరులపాడులను ప్రకటించగా, వీరులపాడుకు చెందిన వామపక్ష నాయకులు సమీప గ్రామాల మద్దతును కూడగట్టి అప్పటి హోం శాఖా మంత్రి వసంత నాగేశ్వరరావును కలిసి వీరులపాడులో అనుకూలతలు వివరించి ఏర్పాటు చేయించారు. . అనంతరం 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుకు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మార్చాలని ప్రతిపాదనలు రావడంతో దానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. అందుకు తగిన నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.వీరులపాడుకు తగిన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు, అధికారులు ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు.


హేయమైన చర్య..

మండల కేంద్రం మార్పు అత్యంత హేయమైన చర్య. ఎమ్మెల్యే సోదరులకు అభివృద్ధి చేయడం చేతకాక ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబు? రేపు మరో గ్రామం వాళ్లు మండల కేంద్రం కావాలంటే అప్పుడు కూడా మారుస్తారా? గత 55 రోజులగా దీక్షలు చేస్తుంటే కనీసం స్పందించని అధికార పార్టీ నాయకులు అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. మండల కేంద్రం మార్పును వ్యతిరేకిస్తూ మా పోరాటాన్ని కొనసాగిస్తాం.

 వట్టికొండ చంద్రమోహన్‌, వీరులపాడు మండల పోరాట కమిటీ సభ్యుడు


ఏళ్లనాటి కల నేరవేరింది

మండల వ్యవస్థ ఏర్పడిన నాడే మొదట జుజ్జూరును మండల కేంద్రంగా ప్రకటించారు. ఆనాడు జరిగిన మోసానికి నేడు న్యాయం లభించింది. ఎన్నో ఏళ్లనాటి కల నేరవేరిన రోజు. మా గ్రామం మండల కేంద్రంగా అన్ని విధాలా అనుకూలం. ఇందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు

 పసుపులేటి సాయిబాబు, పూల రాంబాబు, జుజ్జూరు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని