logo

కొడుకుని కడతేర్చిన తల్లి

అందినకాడికి రూ.లక్షల్లో అప్పులు చేసి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న కుమారుణ్ని తల్లే కడతేర్చిన ఘటన ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో చోటుచేసుకుంది.

Published : 09 Feb 2023 02:01 IST

చేసిన అప్పులతో పరువు పోతుందనే హత్య

నిందితురాలు రమాదేవి

పెద్దఅవుటపల్లి(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: అందినకాడికి రూ.లక్షల్లో అప్పులు చేసి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న కుమారుణ్ని తల్లే కడతేర్చిన ఘటన ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో చోటుచేసుకుంది. ఈ కేసు వివరాలను డీఎస్పీ విజయపాల్‌ బుధవారం విలేకర్లకు వెల్లడించారు. గ్రామానికి చెందిన ఉప్పలపాటి దీప్‌చంద్‌(29) గృహోపకరణాల పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. వివాహం కాని దీప్‌చంద్‌ పెద్దఅవుటపల్లిలోని సొంతింటిలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంటాడు. డ్రైవర్‌గా పని చేసే తండ్రి తెల్లవారు జామున 5 గంటలకే విధులకు వెళ్లాడు. తండ్రి వెళ్లిన కొద్ది సేపటికే తల్లి రమాదేవి కూడా పాలు తీసేందుకని బయటకు వెళ్లి తిరిగొచ్చే సరికి దీప్‌చంద్‌ తీవ్రగాయాలతో చనిపోయి రక్తపు మడుగులో కనిపించాడు. సీఐ నరసింహమూర్తి.. ఆత్కూరు ఎస్సై సూర్యశ్రీనివాస్‌తో కలిసి సంఘటనా స్థలిని పరిశీలించారు. ఘటనపై వీఆర్వో జి.శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పనులు చేసే క్రమంలో దీప్‌చంద్‌ చేసిన అప్పులు ఎక్కువవ్వడంతో పాటు తిరిగి కట్టడం లేదని తల్లి రమాదేవితో కుమారుడు దీప్‌చంద్‌ల మధ్య కలహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వారు తరచూ ఇంటి చుట్టూ తిరగడంతో పరువుపోతుందని భావించిన తల్లి రమాదేవి.. మంగళవారం ఉదయం నిద్రమత్తులో ఉన్న దీప్‌చంద్‌ తలపై రోకలిబండతో నాలుగు సార్లు మోదినట్లు గుర్తించారు. ఘటనలో కుమారుడు దీప్‌చంద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి రమాదేవి వినియోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయపాల్‌ వివరించారు. పోస్టుమార్టం అనంతరం మృతుడు దీప్‌చంద్‌ను తండ్రి సీతారామాంజనేయులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని