logo

Vijayawada: స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడు.. ఏడాదిగా బెదిరిస్తూ అత్యాచారం

ఓ మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి బెదిరించాడు. తన మాట వినకపోతే ఫొటోలు బయట పెడతానంటూ వేధించాడు.

Updated : 03 Mar 2023 08:51 IST

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : ఓ మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి బెదిరించాడు. తన మాట వినకపోతే ఫొటోలు బయట పెడతానంటూ వేధించాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా.. రూ.లక్షల్లో నగదు తీసుకున్నాడు. ఆ నగదు ఇవ్వాలని తిరిగి అడిగినందుకు ఆమెపైనే దాడికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు తాళలేని బాధితురాలు.. తన కుటుంబ సభ్యుల సాయంతో విజయవాడ నగరం నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సీఐ కాగిత శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. స్టేషన్‌ పరిధిలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్‌(45) బీపీసీఎల్‌ కంపెనీలో పైపులైను సెట్టింగ్‌ పనులు చేస్తుంటాడు. రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(35) శాంతినగర్‌లో తన భర్తతో కలిసి పచారీ దుకాణం నిర్వహిస్తోంది. దుకాణంలో సరకులు కొనుగోలు చేసి, ఫోన్‌ పే, పేటియం ద్వారా పలుమార్లు నగదు చెల్లింపులు చేసే సందర్భంలో ఆ మహిళ ఫోన్‌ నెంబరును తెలుసుకున్నాడు సుభాష్‌. అలా.. సరకులకు వెళ్లినప్పుడల్లా ఆమెతో మాటలు కలిపాడు. ఒక రోజున ఆమె.. రాజీవ్‌నగర్‌లోని ఇంటి వద్ద స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి, తన మాట వినకపోతే ఫొటోలు బయట వ్యక్తులకు చూపుతానంటూ బెదిరించాడు. ఆమె వద్దని వారిస్తున్నా.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమెను బెదిరించి రూ.16లక్షల నగదు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని ఆమె అడిగితే.. కొట్టాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేయడం, తాజాగా ఆమెను కొట్టడంతో వేధింపులు తాళలేని బాధితురాలు... ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సాయంతో సుభాష్‌పై బుధవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి సుభాష్‌కు రిమాండ్‌ విధించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు