logo

5జీ పేరుతో వల

ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న 5జీ నెట్‌వర్క్‌ పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వేగవంతమైన అంతర్జాలాన్ని ఉపయోగించుకోవాలన్న వినియోగదారుల ఉత్సుకతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

Published : 06 Mar 2023 04:36 IST

సిమ్‌ అప్‌గ్రేడ్‌ చేస్తామని మోసాలు
లింకులు, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా లూటీ
ఈనాడు, అమరావతి

ప్పుడిప్పుడే విస్తరిస్తున్న 5జీ నెట్‌వర్క్‌ పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వేగవంతమైన అంతర్జాలాన్ని ఉపయోగించుకోవాలన్న వినియోగదారుల ఉత్సుకతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ తరహా మోసాలు గత రెండు నెలల నుంచి వెలుగుచూస్తున్నాయి. ఇదే అదునుగా భావించి సరికొత్త పంథాలో బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నెపంతో రకరకాల పద్ధతుల్లో అందినంత దోచుకుంటున్నారు. 5జీకి మారేందుకు అప్‌గ్రేడ్‌ చేస్తామంటూ వివిధ రకాలుగా మొబైల్‌ వినియోగదారులను నమ్మిస్తూ టోకరా వేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పలువురు కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాలపై అవగాహన లోపంతో ప్రజలు మోసాల బారిన పడుతున్నారు.

నమ్మి మోసపోతున్నారు

నగరంలోని పటమట ప్రాంతానికి చెందిన యువకుడికి ఓ టెలికాం కంపెనీ నుంచి అంటూ ఫోన్‌ వచ్చింది. విజయవాడలో 5జీ సేవలు మొదలయ్యాయని, మీ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చాయని చెప్పాడు. ఇందుకు గాను లింక్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే 1 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ వస్తుందని నమ్మించాడు. నిజమే అని నమ్మిన ఆ యువకుడు.. తన సెల్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి అడిగిన వివరాలు నింపాడు. ఓటీపీ వివరాలు కూడా చెప్పాడు. అంతే కొద్ది నిముషాల్లోనే ఖాతా నుంచి రూ. 1.2లక్షలు డెబిట్‌ అయినట్లు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ఆ నెంబరుకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాప్‌ అని వచ్చింది.


డబ్బులు దోచుకోవడమే లక్ష్యం

న్ని వర్గాల్లో మొబైల్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. అధిక సామర్థ్యం ఉన్న వీడియోలు డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ చేసుకోవడం, వీడియో కాల్స్‌, తదితర అవసరాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న పరిజ్ఞానం కావడంతో అందరిలో ఉండే ఆత్రుతను మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. మీ చరవాణిలో 5జీ సేవలను పొందాలంటే మీకు వచ్చిన సందేశంలోని లింకును క్లిక్‌ చేస్తే చాలు అంటూ తమ పని మొదలుపెడతారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే మీ 4జీ సిమ్‌ కాస్తా 5జీలోకి మారిపోతుందటూ నమ్మబలుకుతారు. అలా నమ్మి లింక్‌ని క్లిక్‌ చేస్తే వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంకుకు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు కూడా వారి చేతికి వెళ్లిపోతున్నాయి.

టెలికాం సంస్థ నుంచి కాల్‌ చేస్తున్నట్లు మనకు కాల్‌ చేస్తారు. మీరు మా అమూల్యమైన వినియోగదారులు కావడంతో మిమ్మల్ని ఎంపిక చేశామంటూ చెబుతూ 5జీకి మారాలంటే సిమ్‌ను మార్చాల్సి ఉంటుందని, మీకు అదంతా అవసరం లేదని మీకు పంపించే ఈ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నామమాత్రం రుసుము చెల్లిస్తే పని అయిపోతుందంటూ మభ్యపెడతారు. స్కాన్‌ చేయటమే ఆలస్యం మన యూపీఐ ఐడీ సమాచారాన్ని సేకరించి మన బ్యాంకులో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు.


అవగాహనతో అరికట్టవచ్చు..

5జీ సేవలు జనవరిలో ప్రారంభమయ్యాయి. ఇవి అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే చాలా సమయం పడుతుంది. కంపెనీలు దశలవారీగా తమ టవర్లను అప్‌గ్రేడ్‌ చేస్తాయి. ప్రస్తుతం లాంఛనంగా విజయవాడ నగరంలో పలు నెట్‌వర్క్‌ ఆపరేటర్లు మొదలుపట్టారు. ఇప్పటికి నగరంతో పాటు, చుట్టపక్కల ప్రాంతాల్లో సిగ్నళ్లు వస్తున్నాయి. త్వరలో మచిలీపట్నంలో సేవలు అందనున్నాయి. ఈ సంగతి వినియోగదారులు గుర్తించాలి.

ఈ పేరుతో కేటుగాళ్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లకు స్పందించకపోవడం ఉత్తమం. దీనిపై అవగాహన ఉంటేనే ఈ మోసాల నుంచి బయటపడొచ్చు. మన ప్రాంతంలో సంబంధిత టెలికామ్‌ సంస్థ 5జీ సేవలు అందిస్తోందో లేదో తెలుసుకోవాలి. దీని కంటే ముందు మనం వాడేది 5జీ ఫోన్‌ అయితే సిగ్నళ్లు అందుతాయి. ఇవేవీ లేకుండా మారడం అసాధ్యమనే విషయాన్ని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. కొత్త సిమ్‌ తీసుకోవాలా? సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుందా? సిమ్‌ మార్చుకోకుండానే సెట్టింగ్స్‌లో మార్చుకుంటే సరిపోతుందా? అని వినియోగదారుల మదిలో మెదిలే సందేహాల నివృత్తికి సంబంధిత నెట్‌వర్క్‌ కార్యాలయానికి వెళ్లి నివృత్తి చేసుకోవడం ఉత్తమం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని