logo

గన్నవరం ఎటు..?

ప్రముఖుల రాకపోకలు, విమానాశ్రయం భద్రత నేపథ్యంలో ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో విలీనంపై ఉన్నత స్థాయిలో సమాలోచనలు సాగుతున్నాయి.

Updated : 10 Mar 2023 07:30 IST

కమిషనరేట్‌లో విలీనంపై ఉన్నత స్థాయిలో మల్లగుల్లాలు
విమానాశ్రయం, ప్రముఖుల భద్రత రీత్యా పునరాలోచన

ఈనాడు, అమరావతి: ప్రముఖుల రాకపోకలు, విమానాశ్రయం భద్రత నేపథ్యంలో ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో విలీనంపై ఉన్నత స్థాయిలో సమాలోచనలు సాగుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సర్వే కూడా నిర్వహించారు. కమిషనరేట్‌లో కలపడంపై మొగ్గు చూపినట్లు తెలిసింది. జిల్లాల విభజనలో భాగంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోకి వెళ్లింది. గతంలో నగర కమిషనర్‌ అజమాయిషీలో ఉండే గన్నవరం సర్కిల్‌ జిల్లా పోలీసు యూనిట్‌లో విలీనమైంది. విజయవాడకు గన్నవరం సమీపంలో ఉంది. ఇది రాజకీయంగా కూడా సున్నితమైన ప్రాంతం. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వీవీఐపీల భద్రత విషయంలో సమన్వయలోపం తలెత్తుతోందని గుర్తించారు.

జిల్లా కేంద్రం దూరం: కృష్ణా పోలీసు ప్రధాన కార్యాలయం మచిలీపట్నంలో ఉంది. జిల్లా కేంద్రం నుంచి ఎయిర్‌పోర్టుకు 65 కి.మీ దూరం. విమానాశ్రయంలో భద్రత కోసం డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నా వీవీఐపీలు వచ్చి, వెళ్లే సమయాల్లో ప్రొటోకాల్‌ ప్రకారం ఎస్పీ హాజరు తప్పనిసరి. ప్రముఖుల భద్రత, వాహనశ్రేణి వెళ్లే మార్గంలో బందోబస్తు పర్యవేక్షణ, అదనపు బలగాలను బందరు నుంచి తరలించాల్సి ఉంది. దీంతో ఎక్కువ సమయం ప్రముఖుల భద్రతకే వెచ్చించాల్సి వస్తోంది. గవర్నర్‌, సీఎంకు గ్రీన్‌ ఛానల్‌ ఉంది. వారు ప్రయాణించే మార్గంలో ముందుగానే ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. విమానాశ్రయం వెలుపల నుంచి కేసరపల్లి బుడమేరు వంతెన వరకే కృష్ణా పోలీసు పరిధి. ఇది కేవలం 2.5 కిలోమీటర్లు దూరమే. అయినా ప్రముఖులు వచ్చే సమయంలో రెండు, మూడు గంటలు ముందుగానే విధుల్లో ఉండాలి. ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వారు దాదాపు అందరూ విజయవాడ వెళ్లే వారే ఉంటారు. ఈ కొద్ది దూరానికి బందోబస్తుకు దాదాపు వంద మంది పోలీసులు అవసరం. ఇది అధిక వ్యయ ప్రయాసలతో కూడుకుంటోంది.

రహస్యంగా ఆరా: విలీనంపై ఈ మధ్య పోలీసు అధికారి క్షుణ్ణంగా సర్వే నిర్వహించారు. లోపాలను సరిదిద్దేందుకు గల అవకాశాలు, మెరుగైన ప్రత్యామ్నాయంపై సొంతంగా పరిశీలన చేయడంతో పాటు కొందరు అధికారుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విమానాశ్రయం అధికారులు, భద్రతను పర్యవేక్షించే పోలీసు అధికారిని కలిసి సాధకబాధలపై చర్చించారు. ఎక్కువ మంది నగర కమిషనరేట్‌లో ఉంటేనే సమన్వయం మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డట్లు తెలిసింది.

* గత ఏడాది జులైలో మోదీ పర్యటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేతలు.. ప్రధాని హెలికాప్టర్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి గాలిలోకి లేచిన తర్వాత నల్ల బెలూన్లు ఎగుర వేశారు. అవి విమానాశ్రయం ప్రాంగణంలోకి రావడం కలకలం సృష్టించాయి. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ నేతలు నల్లబెలూన్లతో చేరుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించారు.

* గత నెలలో సీఎం దిల్లీ పర్యటన నిమిత్తం విమానాశ్రయానికి సీఎం జగన్‌ వెళ్లే సమయంలో విమానాశ్రయం బయట భద్రతాపరమైన లోపం తలెత్తింది. ముఖ్యమంత్రి వాహనశ్రేణి ఎయిర్‌పోర్టు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రవేశద్వారం చేరుకుంటుందనగా.. పశువైద్య కళాశాల నుంచి ఓ వాహనం రోడ్డుపైకి వచ్చేసింది. అప్పటికే ఎస్కార్ట్‌ వాహనాలు వెళ్లిపోయాయి.. కాన్వాయ్‌ వెళ్లేలోగా ఇది జరిగింది. దీంతో తేరుకున్న పోలీసులు ఆ వాహనాన్ని పక్కకు తప్పించారు.

* గత నెలలో అప్పటి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ విమానాశ్రయానికి వెళ్తుండగా ఇదే రకమైన పరిస్థితి తలెత్తింది. ఆయన కాన్వాయ్‌కు వెనుక వాహనం గూడవల్లి నుంచి వచ్చింది. దీనిని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు నిలిపివేశారు.

కొత్తగా గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌

శాంతి, భద్రతల పరంగా కీలకమైన గన్నవరం స్టేషన్‌ను యథాతథంగా నగరంలో విలీనం చేయడమా? లేక కొన్ని ప్రాంతాలను మాత్రమే కలపాలా అన్న దానిపై సమాలోచనలు సాగుతున్నాయి. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అదనపు బలగాలు తరలివెళ్లేందుకు అవకాశం ఉంటుంది. మచిలీపట్నం నుంచి రావడానికి చాలా సమయం పడుతుంది. గన్నవరం గ్రామీణ స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. గూడవల్లి, జక్కులనెక్కలం, కేసరపల్లి, సావరగూడెం, దుర్గాపురం తదితర గ్రామాలను దీని కిందకు తీసుకురానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని