logo

భూమిని గుల్లచేసి... రూ.కోట్లు కొల్లగొట్టి...!

‘విజయవాడ నగరానికి సమీపంలోనే యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అటవీశాఖ, మైనింగ్‌, పర్యావరణ అనుమతులేవీ లేకుండానే అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

Updated : 19 Mar 2023 06:03 IST

కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ను ఆనుకునే అక్రమ తవ్వకాలు 
పట్టించుకోని స్థానిక అధికార యంత్రాంగం 
ఎన్‌జీటీకి ఫిర్యాదు అందడంతో విచారణకు రానున్న బృందం

వెలగలేరు సమీపంలోని తాడేపల్లిలో..

ఈనాడు, అమరావతి : ‘విజయవాడ నగరానికి సమీపంలోనే యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అటవీశాఖ, మైనింగ్‌, పర్యావరణ అనుమతులేవీ లేకుండానే అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. విజయవాడ గ్రామీణ మండలంలోని కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్టుకు 500 మీటర్ల పరిధిలోనే ఆనుకుని ఉన్న భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డంగా తవ్వేస్తున్నారు. నైనవరం, కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, జక్కంపూడి గ్రామాల పరిధిలో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులకు అనేక సార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అన్ని శాఖల అధికారులకూ భారీగా మామూళ్లు అందుతుండడమే దీనికి కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.’

అక్రమ తవ్వకాలపై తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) దృష్టి సారించింది. యథేచ్ఛగా ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతోందంటూ కేసరపల్లికి చెందిన మాజీ సైనికోద్యోగి పిల్లి సురేంద్రబాబు ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్‌జీటీ ధర్మాసనం అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించి సమగ్రంగా విచారణ చేయాలంటూ మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్‌ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ విభాగాన్ని ఆదేశించింది. దీంతో చెన్నైలోని రీజియన్‌ కార్యాలయం ఆధ్వర్యంలో విచారణ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న భూముల్లో ఎక్కడెక్కడ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ ఈ బృందం సోమవారం పరిశీలించనుంది. అనంతరం నివేదికను తయారు చేసి ఎన్‌జీటీకి సమర్పిస్తుంది. విజయవాడ గ్రామీణ మండలంలోని కొత్తూరు, తాడేపల్లి, నైనవరం, జక్కంపూడి గ్రామాల్లో జరుగుతున్న తవ్వకాలను ఈ బృందం పరిశీలిస్తున్నట్లు తమకు సమాచారం అందించారని ఫిర్యాదుదారు పిల్లి సురేంద్రబాబు తెలిపారు.

10 ప్రాంతాల్లో భారీగా ...

కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్టుకు ఆనుకొనే సుమారు 10 ప్రాంతాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. వందల ఎకరాల్లో మట్టిని చాలా లోతుగా తవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌కు 500 మీటర్ల పరిధిలో ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదనే కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. అయినా రెవెన్యూ, అటవీ, మైనింగ్‌, విజిలెన్స్‌, పీసీబీ సహా అధికారులెవరూ కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. నిత్యం వందల లారీల్లో మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారు. అధికారులపై ఒత్తిడి పెరిగి ఎప్పుడో ఒకసారి తనిఖీలకు వచ్చినా అక్రమార్కులు అప్రమత్తమవుతున్నారు.

వేలాది లారీల మట్టిని తరలించి..

ఎన్‌జీటీకి అందిన ఫిర్యాదులో విజయవాడ గ్రామీణ మండలంలోని ఏఏ గ్రామాల పరిధిలో ఏ సర్వే నంబర్లలో తవ్వకాలు జరుగుతున్నాయనే వివరాలు సైతం ఉన్నాయి. ప్రధానంగా కొత్తూరు గ్రామంలోని సర్వే నంబరు 40 పరిధిలో అనుమతులు లేకుండా గత కొన్ని నెలల నుంచి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. కొత్తూరు తాడేపల్లి పరిధిలోని ఆర్‌.ఎస్‌.నంబరు 256, జక్కంపూడి గ్రామ సమీపంలో ఆర్‌.ఎస్‌.నంబరు 115లో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారు. వేమవరం గ్రామ పరిధిలో కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ను ఆనుకొని విచ్చలవిడిగా తవ్వుతున్నారు. నైనవరం పరిధిలోని ఆర్‌.ఎస్‌.నంబరు 148లో ఇప్పటికే భారీగా తవ్వేశారు. వేలాది లారీల మట్టిని తరలించి అమ్ముకున్నారు.

కనిపిస్తే వదలడం లేదు...

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అధికార పార్టీ నేతలు చాలా మంది మట్టి తవ్వకాలతోనే గత మూడు నాలుగేళ్లలో రూ.వందల కోట్లను కొల్లగొట్టారు. ఒక్కో టిప్పర్‌ లోడుకు స్థానికంగా రూ.10వేలు, దూరంగా ఉన్న ప్రాంతాలకు వెళితే.. రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ తీసుకుంటున్నారు. ప్రైవేటు వెంచర్లను మెరక చేసేందుకు, రోడ్లు, జగనన్న ఇళ్ల లేఔట్లు సహా అన్నింటికీ ప్రస్తుతం మట్టి కొరత తీవ్రంగా ఉంది. దీంతో డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఏ ప్రాంతాన్నీ వదలడం లేదు. మట్టి కనిపిస్తే తవ్వేసి అమ్ముకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని