logo

ఆలోచనలు.. ఆవిష్కరణలు

మనం నిత్యజీవితంలో వినియోగించే అనేక వస్తువులు, ఇతర సౌకర్యాలు అన్నీ గతంలో పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితమే.

Published : 20 Mar 2023 06:11 IST

ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే

ప్రయోగాలు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

మనం నిత్యజీవితంలో వినియోగించే అనేక వస్తువులు, ఇతర సౌకర్యాలు అన్నీ గతంలో పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితమే. అలా ప్రతి ఒక్కరిలోనూ భిన్నమైన ఆలోచనలు, రక రకాల ఊహలు ఉంటాయి. వాటిని గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించడమే కాదు సమాజానికి అవసరమైన అనేక సౌకర్యాలు సమకూరతాయి. 2020-22 సంవత్సరానికి నిర్వహించిన ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీల్లో జిల్లాలోని వివిధ  ప్రాంతాల విద్యార్థులు తమ ఊహలకు రూపాలు ఇచ్చి అందరి మన్ననలు అందుకుంటున్నారు. జిల్లా నుంచి మొత్తం 35 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి అర్హత సాధించడం విశేషం. వాటిలో పలువురు విద్యార్థుల ప్రయోగాలు, వాటి ఉపయోగాలు, తదితర అంశాలపై ప్రత్యేక కథనం.


రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గూడూరు మండలం తరకటూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అర్జా సాయిలక్ష్మి ఇన్నోవేటివ్‌ స్పీడ్‌బ్రేకర్స్‌ అనే పరికరాన్ని రూపొందించి తన సత్తా చాటింది. తాను తీర్చిదిద్దిన పరికరం ఒకేచోట తిరుగుతూ ఉంటుంది. సరైన మార్గంలో మాత్రమే దీనిపై నుంచి వాహనాలు వెళ్లగలవు. రాంగ్‌రూట్‌లో  ఎదురుగా వస్తే వెళ్లడానికి అవకాశం ఉండదు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను కూడా నియంత్రించవచ్చని వివరించి రాష్ట్రస్థాయికి అర్హత సాధించింది..


వాయి కాలుష్యం తగ్గించేలా..

వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు బంటుమిల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇసుమర్తి సుకీర్తి మినీ ఎయిర్‌ ఫ్యూరిఫైర్‌ను రూపొందించింది. నీటిని ఎయిర్‌ ఫిల్టర్‌గా ఉపయోగించేలా దీన్ని తయారుచేశారు. ఈ పరికరంలో తక్కువ శబ్ధం గల ఫ్యాన్‌లు వినియోగించారు. వీటి ద్వారా గాలిని నీటి ట్యాంకు ద్వారా పంపుతామని తద్వారా నీటిలో దుమ్ము, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలకు అడ్డుకట్ట పడి చల్లని గాలి వస్తుందని విద్యార్థిని వివరించింది.


మహిళలకు ఆసరా

ఆపదలో ఉన్న మహిళలు, యువతులకు ఆసరాగా ఉండేలా బంటుమిల్లి మండలంలోని రామవరపుమోడి ప్రాథ]మికోన్నత పాఠశాల విద్యార్థిని తాతా యోగశ్రీప్రియ ఉమెన్‌ సేఫ్టీబ్యాంగిల్‌ అనే పరికరాన్ని తీర్చిదిద్దింది. చూడటానికి చేతిగాజు మాదిరిగా ఉండే ఈ పరికరాన్ని ధరిస్తే ఎక్కడికి వెళ్లినా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అండగా ఉంటుందని వివరించింది. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పరికరానికి ఉండే చిన్న స్విచ్ఛ్‌ను నొక్కితే పోలీసు కార్యాలయానికి సమాచారం వెళ్లిపోతుంది.


వైర్‌లెస్‌ మొబైల్‌ఛార్జర్‌

గూడూరు మండలంలోని కప్పలదొడ్డి జడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థిని బి.యువశ్రీ ఇన్నోవేటివ్‌ వైర్లెస్‌ మొబైల్‌ ఛార్జర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్తు అయస్కాంత ప్రేరణశక్తి ద్వారా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం పవర్‌ బ్యాంకులు లాంటివి అందుబాటులోకి వచ్చినా వాటికి వైర్ల అవసరం ఉంది. పైగా వాటికి కూడా ఛార్జింగ్‌ పెట్టుకోవాలి. తాను తీర్చిదిద్దిన పరికరానికి ఎలాంటి వైర్లు అవసరం లేకుండా కేవలం చరవాణి పరికరంపైన ఉంచితే చాలు ఛార్జింగ్‌ అవుతుందని, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు