logo

3,814 హెక్టార్లలో పంటలకు నష్టం

రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కొంతవరకు అయినా పంట దక్కుతుందని రైతులు భావిస్తుండగా  శనివారం భారీగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ పొలాల్లో నీరు నిలిచింది.

Updated : 20 Mar 2023 06:40 IST

నీట మునిగిన పొలాలు వి పలుచోట్ల కూలిన విద్యుత్తు స్తంభాలు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే

గూడూరు మండలం మల్లవోలులో  దెబ్బతిన్న మినుము

రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కొంతవరకు అయినా పంట దక్కుతుందని రైతులు భావిస్తుండగా  శనివారం భారీగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ పొలాల్లో నీరు నిలిచింది. రబీలో జిల్లాలో 2.67లక్షల ఎకరాల్లో మినుము పంట సాగైంది. పలు మండలాల్లో చాలావరకు పంట నూర్పిళ్లు చేసినా ఆలస్యంగా సాగు చేసిన పంట ఇంకా పొలాల్లోనే ఉంది. గూడూరు మండలంలోని మేజర్‌ పంచాయతీ అయిన మల్లవోలులో పనలపై ఉన్న మినుముపంటతోపాటు గుట్టలు కూడా తడిచిపోయి నీళ్లల్లో నానుతున్నాయి. కంకటావ, లేళ్లగరువు, గూడూరు ఇలా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెడన మండలంలోని చేవెండ్ర, చెన్నూరుతోపాటు పలు చోట్ల గుట్టలుగా ఉన్న మినుము మొలకలు రావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.  బందరు, చల్లపల్లి ఘంటసాల, కోడూరు, మోపిదేవి, పామర్రు  తదితర మండలాల్లో ఇంకా వేలాది ఎకరాల్లో పంట  దెబ్బతింది. కంకిపాడు, పెనమలూరు, గన్నవరం,  ఉంగుటూరు, ఉయ్యూరు తదితర మండలాల్లో వరితోపాటు మొక్కజొన్న, బందరు, గూడూరు, బంటుమిల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వేరుశనగ పంటలకూ నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 3,814 హెక్టార్లలో వివిధ పంటలు వర్షాల కారణంగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

నేలకొరిగిన వృక్షాలు..

ఈదురు గాలుల కారణంగా పెడన మండలంలోని కొంగంచర్ల ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన కూలిన చెట్ల కారణంగా ఉదయం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేవెండ్ర విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని చేవెండ్రపాలెం, కమలాపురం, ఉప్పలకలవగుంట తదితర గ్రామాల్లో 20 స్తంభాలు నేలకొరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోగా ఆదివారం సాయంత్రానికి పునరుద్ధరించారు..

గుడ్లవల్లేరు మండలం కూరాడ వద్ద రహదారిపై కూలిన భారీవృక్షాన్ని తొలగిస్తున్న సిబ్బంది

35 మి.మీ సగటు వర్షపాతం

జిల్లాలో ఆదివారం ఉదయానికి 35 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది.గుడ్లవల్లేరు మండలంలో 79.8 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తోట్లవల్లూరు లో 7.2 మి.మీ కురిసింది. బంటుమిల్లి 58.4, పెదపారుపూడి 57.8, గుడివాడ 50.6, కంకిపాడు 50.2, కృత్తివెన్ను 44.0, అవనిగడ్డ 42.8, ఉయ్యూరు 42.8, పామర్రు 41.6, మొవ్వ 40.8, చల్లపల్లి 37.4, పెడన 37.2, గూడూరు 37.0, పెనమలూరు 30.4, నందివాడ 29.4, ఉంగుటూరు 29.0, ఘంటసాల 28.8, మోపిదేవి 26.2, నాగాయలంక 26.2, గన్నవరం 25.2, కోడూరు 22.4, పమిడిముక్కల 10.6, మచిలీపట్నం 10.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది.


వివరాలు సేకరిస్తున్నాం

జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నాం. ఆ దిశగా జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడెక్కడ ఎంత మేర ఏయే పంటలకు నష్టం వాటిల్లిందో నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. 

మనోహరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి 


విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాం

మచిలీపట్నం డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేెలకొరగడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని తిరిగి నెలకొల్పేలా చర్యలు తీసుకున్నాం. పెడన, బందరు, బంటుమిల్లి మండలాల్లో కొంతసేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడగా వెంటనే పునరుద్ధరించాం.

ఎం. భాస్కరరావు, విద్యుత్తు శాఖ ఈఈ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని