logo

ఆగని మృత్యుఘోష

రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. వీటికితోడు రహదారుల నిర్మాణంలో లోపాలు కూడా కారణమవుతున్నాయి.

Published : 20 Mar 2023 06:19 IST

ప్రాణాలు తోడేస్తున్న బ్లాక్‌స్పాట్లు
నిత్యకృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాలు
ఈనాడు, అమరావతి

రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. వీటికితోడు రహదారుల నిర్మాణంలో లోపాలు కూడా కారణమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. ఫలితంగా ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రహదారుల నిర్మాణానికి రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నా భద్రత విషయంలో ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. జిల్లాలోని చాలాచోట్ల బ్లాక్‌స్పాట్లను సరి చేయడంలో విఫలమవుతున్నారు. ఎక్కువగా ప్రాణనష్టం వీటి కారణంగానే సంభవిస్తోంది. రహదారి భద్రతా సమావేశాల్లో ప్రమాదాల అడ్డుకట్టకు నిర్ణయాలు తీసుకుంటున్నా అవి ఆచరణలోకి రావడం లేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో జాతీయ రహదారులపైనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

గుర్తించినా పట్టించుకోరు

రహదారులు ఇరుకిరుకుగా ఉండడం, వంకరగా ఉండడం, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, రద్దీ ప్రాంతాల్లో వేగనిరోధకాలు లేకపోవడం, తదితర కారణాలతో దుర్ఘటనలు జరుగుతున్నాయి. వీటిని రవాణా, ర.భ, జాతీయ రహదారుల విభాగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాలి. అక్కడక్కడా బాగు చేసినా, చాలా చోట్ల అలాగే ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో మొత్తం 105 బ్లాక్‌స్పాట్లు ఉన్నట్లు తేల్చారు. జిల్లా నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులు ఎక్కువ నిడివితో విస్తరించి ఉన్నాయి.  ఎన్టీఆర్‌ జిల్లాలో గతేడాది గణాంకాలు పరిశీలిస్తే సగటున నెలకు 129 ప్రమాదాలు జరిగాయి. నెలకు 35 మరణాలు సంభవించగా, 114 మంది క్షతగాత్రులయ్యారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై దీపాల వెలుతురు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
నీ చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై రామవరప్పాడు నుంచి గూడవల్లి కూడలి వరకు రాత్రి సమయాల్లో అంధకారం నెలకొంటోంది. సెంట్రల్‌ లైటింగ్‌ వెలగడం లేదు. ఈ పరిధిలోని 8 కి.మీ నిడివిలో రోజుకు సగటున ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో సగం రాత్రి సమయాల్లోనే ఉంటున్నాయి. ఇటీవల.. ఏలూరు నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. గూడవల్లి వచ్చే సరికి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ చీకట్లో ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు.

* విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని పలు ప్రాంతాలు ప్రమాదాలకు కేంద్రాలుగా మారాయి. ప్రధానంగా చిల్లకల్లు, అంబారుపేట అడ్డరోడ్డు, ఐతవరం, కీసర వంతెన సమీపం, బీరకలపాడు అడ్డరోడ్డు, తదితర ప్రాంతాలు ప్రమాదాలకు అడ్డాలుగా మారాయి. కంచికచర్లలోని బంకు సెంటర్‌ నుంచి చెవిటికల్లు సెంటర్‌ వరకు జాతీయ రహదారి ఒకవైపు ఎత్తుగా, మరోవైపు పల్లంగా ఉంటుంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం మూడు నెలల్లోనే 30 వరకు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

* హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిలో కనకదుర్గ వంతెన గత ఏడాది ప్రారంభమైంది. హైదరాబాద్‌ వెళ్లే వైపు భవానీపురం వద్ద వంతెన ముగుస్తుంది. ఈ ప్రాంతంలో పక్క నుంచి వచ్చే అప్రోచ్‌ రోడ్డు  ఇరుకిరుకుగా ఉండడంతో వంతెన పైనుంచి వచ్చే వాహనాలు, అప్రోచ్‌ రోడ్డు నుంచి వచ్చేవి ఢీకొంటున్నాయి. ఈ లోపాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని