logo

‘బాధ్యతల అప్పగింతలో ప్రభుత్వ నిర్లక్ష్యం’

గ్రామ పంచాయతీల్లో 5వ శ్రేణి కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడంలో ప్రభుత్వం నిరీక్షించే ధోరణినే ఇంకా అవలంబించడం పట్ల ఏపీ వార్డు/గ్రామ సచివాలయాల ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జానీ పాషా ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 20 Mar 2023 06:21 IST

మాట్లాడుతున్న జానీ పాషా. చిత్రంలో రత్నం, హరి, రామకృష్ణారెడ్డి, దినేష్‌, రమేష్‌, ప్రసాద్‌, ధనశేఖర్‌ తదితరులు

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : గ్రామ పంచాయతీల్లో 5వ శ్రేణి కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడంలో ప్రభుత్వం నిరీక్షించే ధోరణినే ఇంకా అవలంబించడం పట్ల ఏపీ వార్డు/గ్రామ సచివాలయాల ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జానీ పాషా ఆందోళన వ్యక్తం చేశారు. 5వ శ్రేణి కార్యదర్శులకు పూర్తి బాధ్యతలను తక్షణమే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో, రాష్ట్ర ఫెడరేషన్‌ నేతృత్వంలో ఆదివారం 5వ శ్రేణి పంచాయతీ కార్యదర్శుల ‘చర్చా గోష్ఠి’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అధికారాల సాధన కోసం ‘రూట్‌ మ్యాప్‌’ను తయారు చేసినట్టు తెలిపారు. 5వ శ్రేణి కార్యదర్శుల విభాగ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 2019, అక్టోబరులో చేపట్టిన నియామక ప్రక్రియలో 7,040 మంది 5వ శ్రేణి కార్యదర్శుల ఉద్యోగాల భర్తీ చేపట్టారన్నారు. ప్రస్తుతం ఈ వ్యవస్థలో సుమారు 6,700 మంది పని చేస్తున్నట్టు చెప్పారు. ఒకటి నుంచి నాలుగో శ్రేణి కార్యదర్శులకు పూర్తి పాలనా బాధ్యతలు, డీడీవో అధికారాలు ఉండగా, వీటిని 5వ శ్రేణి వారికి అమలు చేయడం లేదన్నారు. బాధ్యతలను అప్పగించడంలో మూడున్నరేళ్లుగా జాప్యం జరుగుతోందని విమర్శించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చర్చా గోష్ఠులు. జీవో నంబరు 149ని అమలు చేయాలని జిల్లా స్థాయిలో వినతి పత్రాల సమర్పణ. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డికి, రాష్ట్ర స్థాయి అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు మరో సారి వినతి పత్రాలు ఇవ్వా’లని చర్చా గోష్ఠిలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, ఉపాధ్యక్షుడు కె.రామకృష్ణారెడ్డి, సమావేశ కన్వీనరు ఎస్‌.హరి, నాయకులు కె.దినేష్‌, జి.రమేష్‌బాబు, ప్రసాద్‌, ధనశేఖర్‌, 5వ శ్రేణి కార్యదర్శులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని