logo

విద్యుత్తు ఇవ్వరు.. మోటారు అమర్చరు!

వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న జలకళ పథకం రైతులకు అందకుండా పోయింది. మెట్ట ప్రాంత సాగు భూములకు నీరందించేందుకంటూ ఉద్దేశించిన ఈ పథకం ఆర్భాటపు తంతుగా మిగిలింది.

Updated : 20 Mar 2023 06:33 IST

రైతులకు దూరమైన జలకళ
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

అంపాపురంలో నిరుపయోగంగా బోరు

వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న జలకళ పథకం రైతులకు అందకుండా పోయింది. మెట్ట ప్రాంత సాగు భూములకు నీరందించేందుకంటూ ఉద్దేశించిన ఈ పథకం ఆర్భాటపు తంతుగా మిగిలింది. ఇందులో భాగంగా రెండున్నరేళ్ల కిందటే బోర్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. గ్రామాల వారీగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. కానీ ఏ మండలంలో కూడా అనుకున్న లక్ష్యం మేరకు బోర్లు తవ్వలేదు సరికదా, తవ్విన బోర్లలో మూడొంతులకు నేటికీ విద్యుత్తు సరఫరా ఇవ్వలేదు.

నెరవేరని లక్ష్యం

మెట్ట ప్రాంతంలో కనిష్ఠంగా రెండున్నర, గరిష్ఠంగా అయిదు ఎకరాల పొలం ఉండి, ఇప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి వ్యవసాయ బోరు లేని రైతులు జలకళ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. గ్రామ సచివాలయంలో తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే, క్షేత్ర పరిశీలన, భూగర్భ జల నిపుణుల సర్వే అనంతరం డ్వామా ఆధ్వర్యంలో అనుమతులు మంజూరు చేసి, ఆ తర్వాత ఎంపిక చేసిన గుత్తేదారు ద్వారా బోరు డ్రిల్లింగ్‌ చేయించి, తదుపరి విద్యుత్తు, మోటారు సౌకర్యం కల్పిస్తామనేది ప్రభుత్వం చెప్పిన మాట. కానీ కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 1,545 బోర్లు తవ్వగా, వాటిల్లో పది శాతం బోర్లకు కూడా విద్యుత్తు సౌకర్యం ఇవ్వలేదు.

ఖర్చు పెట్టుకున్నా లేదంట..

బోరు వేయడంతో పాటు దానికి విద్యుత్తు సౌకర్యం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని మొదట్లో ప్రకటించారు. ఆ తర్వాత రూ.రెండు లక్షలకు లోపుగా ఖర్చయ్యే వాటికి మాత్రమే ప్రభుత్వం నిధులిస్తుందని, అంచనాలు దాటితే ఆ మొత్తం లబ్ధిదారే భరించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఖర్చు భారమైనా, అవసరం కాబట్టి పెట్టుకుందామని రైతులు ముందుకు వచ్చారు. కానీ ఆ మాటలు మౌఖికంగానే చెప్పారని, ఉత్తర్వుల రూపంలో రాలేదంటూ సీపీడీసీఎల్‌ అధికారులు చెప్పడంతో రైతులు డీలా పడ్డారు. ఆ తర్వాత విద్యుత్తు ఖర్చు మొత్తం లబ్ధిదారులే భరించుకోవాలని ఆదేశాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. రైతులు దీనికి కూడా సిద్ధపడినా, సరైన మార్గదర్శకాలు లేకపోవడం, వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే సైట్‌ని మూసివేయడంతో మరోసారి లబ్ధిదారులకు మొండి చెయ్యే మిగిలింది.

బోర్లు తవ్విన వారు 30 శాతం లోపే.. 

ఈ పథకానికి రెండు జిల్లాల పరిధిలో వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీటిల్లో ఇప్పటి వరకు బోర్లు తవ్విన వారి సంఖ్య 30 శాతానికి లోపుగానే ఉండటం గమనార్హం. బోర్లు తవ్వేందుకు ఎంపిక చేసిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పాటు, వేసిన బోర్లకు విద్యుత్తు, మోటార్లు సమకూర్చడానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడమే జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇదీ పరిస్థితి..

* బాపులపాడు మండలం అంపాపురంలో ఓ మహిళా రైతు పొలంలో ఏడాదిన్నర కిందట బోరు వేశారు. ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షను ఇవ్వలేదు.

* ఇదే గ్రామానికి చెందిన మరొక రైతు పొలంలో గతేడాది ఆరంభంలోనే బోరు చేశారు. ఆ తర్వాత విద్యుత్తు సౌకర్యం కూడా కల్పించారు. కానీ ఇప్పటి వరకు మోటారు అమర్చకపోవడంతో పొలం వరకు వచ్చిన నీరు పంటకు చేరే పరిస్థితి లేకుండా పోయింది.

* ఎవరిని అడగాలో తెలియదు: దరఖాస్తు చేసిన వారికి బోరు ఎప్పుడిస్తారు? విద్యుత్తు ఎప్పుడిస్తారు? మోటారు ఎప్పుడు అమర్చుతారనే విషయం తెల్సుకోవడం లబ్ధిదార్లకు ప్రహసనంగా మారింది. గ్రామ, మండల స్థాయిలో అధికారులు ఆన్‌లైన్‌ ప్రకారం కార్యాచరణ మొదలవుతుందని మినహా ఎలాంటి వివరాలు చెప్పరు. విద్యుత్తు గురించి సీపీడీసీఎల్‌ అధికారుల్ని సంప్రదిస్తే పంచాయతీరాజ్‌ శాఖ నుంచి తమకు వివరాలు, ఆదేశాలు వస్తేనే అవసరమైన పనులు చేపట్టగలమనే బదులు మాత్రమే వినిపిస్తోంది. దీంతో లబ్ధిదారులు నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని