logo

సమస్యల నివేదన.. నిధుల ప్రకటన

తిరువూరులో ఆదివారం జగనన్న విద్యాదీవెన పథకం నిధుల విడుదల సభకు హాజరైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు.

Updated : 20 Mar 2023 06:32 IST

కట్లేరు వాగుపై వంతెన నిర్మాణానికి రూ.26 కోట్లు
నియోజకవర్గానికి మరో ఆరు వేల ఇళ్ల మంజూరు
తిరువూరు సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

జగనన్న విద్యా దీవెన చెక్కును విద్యార్థులకు అందజేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, సామినేని ఉదయభాను, కలెక్టర్‌ డిల్లీరావు తదితరులు

తిరువూరు, న్యూస్‌టుడే: తిరువూరులో ఆదివారం జగనన్న విద్యాదీవెన పథకం నిధుల విడుదల సభకు హాజరైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా నెలకొన్న సమస్యల్లో ఏడింటిని సీఎం జగన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని చేసిన విజ్ఞప్తికి సీఎం స్పందించారు. వినగడప వద్ద కట్లేరు వాగుపై వంతెన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎ.కొండూరు మండలంలో అత్యధికంగా ఉన్న కిడ్నీ బాధితులకు తమ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేశామని, కృష్ణా జలాలు అందించే పథకం నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో 8 వేల పైచిలుకు నివేశన స్థలాలు పంపిణీ చేశామని, ఇప్పటికే మంజూరు చేసిన 4 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మరో 6 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారుల అభివృద్ధికి రూ.10 కోట్లు, తిరువూరు పట్టణంలో డ్రెయిన్ల నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేయాలని కోరగా, ఐఐటీ, పాలిటెక్నిక్‌ కళాశాల, బడిమానేసిన పిల్లల కోసం వివిధ కోర్సులతో కూడిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ త్వరలో తిరువూరు వస్తుందని ప్రకటించిన సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.

సీఎం సభ వద్ద దళిత ప్రజాప్రతినిధికి అవమానం

సీఎం పర్యటన సందర్భంగా అధికారపార్టీకి చెందిన దళిత మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి రావడానికి ముందు ఎంపీపీ జి.భారతితో కలిసి సభావేదికపైకి వెళ్తున్న పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాను మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌నని చెప్పినప్పటికీ అధికారులు ఇచ్చిన జాబితాలో మీ పేరు లేదంటూ వేదిక పైకి వెళ్లేందుకు అనుమతించలేదు. సీఎం వస్తున్నారు...పక్కకు వెళ్లాలంటూ భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వేదిక వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న వైకాపా నాయకుడు కలకొండ రజనీకాంత్‌ తన వద్ద ఉన్న జాబితాను భద్రతా సిబ్బందికి చూపించడంతో అనుమతించారు. ఇది గమనించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆమెను సముదాయించారు. పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న కార్యక్రమంలో ప్రథమ పౌరురాలైన తన పేరు లేకపోవడం పట్ల ఆమె మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆమె చెప్పగా, కార్యక్రమం పూర్తయిన తరువాత బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన సర్ది చెప్పడంతో శాంతించారు. ప్రొటోకాల్‌ పాటించకుండా తనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌, పురపాలక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.


చంటి బిడ్డకు సాయం కోసం వస్తే పోలీసులు అడ్డుకున్నారు

మెదడువాపు వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తె చికిత్సకు అవసరమైన సాయం కోరేందుకు సీఎం జగన్‌ను కలవాలని వచ్చిన తనను పోలీసులు అడ్డుకున్నారని ఎ.కొండూరు మండలం చీమలపాడుకు చెందిన కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎంను కలిసేందుకు వెళ్లగా అనుమతించ లేదని, సభావేదిక వద్దకు వెళ్లాలని చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె భవ్య చికిత్స నిమిత్తం 10 నెలల్లో రూ.19 లక్షలు ఖర్చు చేశామని, అయినా కోలుకోలేదని వాపోయారు. సీఎంను కలిసి ఆర్థిక సాయం అడిగేందుకు వస్తే పోలీసులు తమను ఎక్కడికక్కడ నిలువరించారని కన్నీటి పర్యంతమైంది. హెలిప్యాడ్‌ నుంచి మండుటెండలో కుమార్తెను తీసుకుని సభావేదిక వద్దకు వచ్చిన ఆమెకు నిరాశే మిగిలింది.


నిర్బంధాలు... ఆంక్షలు

ఎండ వేడి తట్టుకోలేక సభ వద్ద సొమ్మసిల్లి పడిపోయిన ఓ మహిళను
తీసుకెళ్తున్న అంబులెన్సు జనం మధ్య ఇరుక్కుపోయిందిలా...

తిరువూరు, న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తిరువూరులో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంతోపాటు పరిసర మండలాల్లోని ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు నిర్బంధించారు. దీంతోపాటు ట్రాఫిక్‌ మళ్లించడంతో ప్రజలు అవస్థలు పాలయ్యారు. 

ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో లక్ష్మీపురం నుంచి వెనుదిరిగి వెళ్తున్న ద్విచక్ర వాహన చోదకులు

ఎ.కొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్యకు స్టేషన్‌ వద్ద సంఘీభావం తెలుపుతున్న నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని