logo

మట్టి అక్రమ తవ్వకాలపై విచారణ

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని జక్కంపూడి, నైనవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) నియమించిన అధికారుల బృందం సోమవారం విచారణ చేపట్టింది.

Updated : 21 Mar 2023 06:25 IST

ప్రధాన శాఖల అధికారుల గైర్హాజరు

అసంపూర్తిగా ముగిసిన ప్రక్రియ

కొత్తూరు తాడేపల్లిలో విచారణ చేస్తున్న సబ్‌-కలెక్టర్‌ అదితిసింగ్‌, ఇతర శాఖల అధికారులు

గొల్లపూడి, న్యూస్‌టుడే

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని జక్కంపూడి, నైనవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) నియమించిన అధికారుల బృందం సోమవారం విచారణ చేపట్టింది. ఆయా గ్రామాల్లో అక్రమంగా మైనింగ్‌ జరుగుతున్నట్లుగా సమత సైనిక్‌ దళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సైనికుడు పిల్లి సురేంద్రబాబు ఎన్‌జీటీ, దిల్లీకి ఈ ఏడాది జనవరి 10న ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్‌జీటీ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు, జిల్లా కలెక్టర్‌ సభ్యులుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఫిబ్రవరి 10న తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారుల బృందం మైనింగ్‌ కార్యకలాపాలు జరుగుతున్న ఆయా గ్రామాల్లో సోమవారం పర్యటించి విచారణ చేసింది.

అర్ధంతరంగా ముగిసిన... సబ్‌-కలెక్టర్‌ అదితి సింగ్‌, అటవీ శాఖ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసులు రెడ్డి, డీఎఫ్‌ఓ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ త్రిమూర్తులు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు, గ్రామీణ మండల తహసీల్దారు విచారణకు వచ్చారు. అధికారులు అడిగే ప్రశ్నలకు అటవీ సిబ్బంది నీళ్లు నమిలారు. తమకు సంబంధం లేదన్నట్లుగా, అటవీ శాఖ పరిధిలో మైనింగ్‌ జరగలేదన్నట్లుగా పేర్కొన్నారు. పోలవరం కాలువ పరిధిలో మైనింగ్‌, జలవనరుల శాఖ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మైనింగ్‌, జలవనరుల శాఖ అధికారులు ఎక్కడా అంటూ సబ్‌-కలెక్టర్‌ ప్రశ్నించగా హాజరు కాలేదన్నారు. మైనింగ్‌కు అనుమతులు ఉన్నాయనే పత్రాలనూ చూపించలేకపోయారు. ఫలితంగా విచారణ ప్రక్రియ అర్ధంతరంగా ముగిసింది. అక్కడి నుంచి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. తదుపరి మైనింగ్‌, జలవనరులు, ఇతర శాఖల అధికారులను పిలిపించి మరో దఫా విచారణ చేస్తామని సబ్‌-కలెక్టర్‌ ప్రకటించారు. ఈలోపు ఎంత మేర మైనింగ్‌ చేపట్టారనే విషయాన్ని సర్వే చేయించి గుర్తిస్తామన్నారు.

జక్కంపూడిలో తవ్విన కొండ

అప్రమత్తమైన మట్టి మాఫియా... ఇదిలా ఉండగా మట్టి తవ్వకాలపై విచారణకు ఎన్‌జీటీ అధికారుల బృందం వస్తున్నారనే విషయం తెలుసుకున్న మట్టి మాఫియా అప్రమత్తమైంది. ఆదివారం రాత్రే మైనింగ్‌ చేసే ప్రాంతాల నుంచి పొక్లెయిన్లు, లారీలను తరలించేశారు. ఎక్కడా మట్టి తవ్వుతున్నారన్న విషయాన్ని తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కొన్నిచోట్ల క్వారీల్లోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుగా మట్టి కుప్పలు పోసి ఉంచడంతో అధికారుల బృందం వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత జక్కంపూడి, కొత్తూరుతాడేపల్లి గ్రామాల పరిధిలో మట్టి తవ్వకాలు చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టడాన్ని గుర్తించారు. ఒక్కోచోట రెండు, మూడు తాటి చెట్లు లోతులో తవ్వకాలు చేశారన్నారు.

విచారణపై అసంతృప్తి:  మరోవైపు విచారణ ప్రక్రియపై ఫిర్యాదుదారు పిల్లి సురేంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులైన ప్రధాన శాఖల అధికారులు గైర్హాజరయ్యారన్నారు. మరో దఫా విచారణ చేస్తామని ప్రకటించారని, ఎప్పుడు చేస్తారో తెలపలేదన్నారు. దాదాపుగా 400 ఎకరాల మేర తవ్వకాలు చేశారని, అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌జీటీలో చేసిన ఫిర్యాదుపై కొందరి నుంచి తమకు బెదిరింపులు వచ్చినా తలొగ్గలేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు