logo

వీఆర్వో చేయి కొరికిన మహిళా కానిస్టేబుల్‌

వీఆర్వో, మహిళా కానిస్టేబుల్‌ పరస్పర దాడులు చేసుకోవడం గుడివాడలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 21 Mar 2023 04:48 IST

ధర్నా చేస్తున్న వీఆర్వో భార్య తేజశ్రీ, వీఆర్వోలు, సీపీఎం నాయకులు

గుడివాడ(నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: వీఆర్వో, మహిళా కానిస్టేబుల్‌ పరస్పర దాడులు చేసుకోవడం గుడివాడలో సోమవారం చోటుచేసుకుంది. ‘చలో విజయవాడ’లో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డుకునేందుకు గుడివాడ రైల్వే స్టేషన్లో తనిఖీ చేస్తున్న తరుణంలో దొండపాడు వీఆర్వో కె.అనిల్‌ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేసే తన భార్యను రైలు ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా మహిళా కానిస్టేబుల్‌ రమాదేవి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుంచి బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నించిన వీఆర్వో అనిల్‌ను రమాదేవి అడ్డుకునే ప్రయత్నం చేయగా గొడవ పెద్దదైంది. ఆ ఘర్షణలో వీఆర్వో చేయి మహిళా కానిస్టేబుల్‌కు తగిలింది. దీంతో ఆమె వీఆర్వో చేయిని కొరికింది. ఈ గొడవను చూసిన ప్రయాణికులు నిర్ఘాంతపోయారు. దీనిపై సీఐ తులసీధర్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

‘పోలీసుల పక్షపాతం నశించాలి’

గుడివాడ(నెహ్రూచౌక్‌),న్యూస్‌టుడే: వీఆర్వో, మహిళా కానిస్టేబుల్‌ మధ్య చోటుచేసుకున్న వివాదంలో వీఆర్వోపై కేసు నమోదు చేయడం అన్యాయమని వీఆర్వోల సంఘం నాయకుడు గూడపాటి లక్ష్మణరావు ఆరోపించారు. పోలీసుల వైఖరికి నిరసనగా వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో స్థానిక రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట సోమవారం రాత్రి ధర్నా చేశారు. ఈ వివాదంలో వీఆర్వో అనిల్‌పై కేసు నమోదు చేశారని.. వీఆర్వోపై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయకపోవడం దారుణమని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్‌సీపీ రెడ్డి పేర్కొన్నారు. వీఆర్వో, అతని భార్య తేజశ్రీ ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించకుండా పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్‌ఐలు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు