మూడేళ్లలో రూ.3 కోట్లూ రాలేదు
‘దుర్గగుడి సమగ్రాభివృద్ధికి రూ.70 కోట్లను కేటాయిస్తున్నట్టు 2020లో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించి ఇప్పటికి మూడేళ్లవుతోంది.
రూ.70 కోట్లు ఇస్తానని ప్రకటించిన సీఎం జగన్
మంత్రి, ఈవో, పాలక మండలి కూడా మారిపోయింది
కొండరాళ్ల పనులు తప్ప ఏవీ చేపట్టలేదు
ఈనాడు, అమరావతి
‘దుర్గగుడి సమగ్రాభివృద్ధికి రూ.70 కోట్లను కేటాయిస్తున్నట్టు 2020లో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించి ఇప్పటికి మూడేళ్లవుతోంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో దశాబ్దాలుగా ఆలయంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేస్తామంటూ అప్పటి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా ఘనంగా ప్రకటించారు. ఇప్పటివరకూ కేవలం రూ.3 కోట్లు కూడా రాలేదు. మరో రూ.67కోట్లకు పైగా రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఇస్తానంటూ చెప్పిన డబ్బులకు అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చేసిందని దుర్గగుడి అధికారులు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కానీ పనులు మాత్రం చేపట్టడం లేదు. పనులు చేపడితే.. బిల్లులు పెట్టాలి, వాటిని ప్రభుత్వం విడుదల చేస్తుందో లేదో తెలియని అయోమయం ఉంది. అందుకే పనులు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.’
ముఖ్యమంత్రి రూ.70 కోట్లు ఇస్తానంటూ ప్రకటించిన తర్వాత ఈ మూడేళ్లలో దేవాదాయశాఖ మంత్రి, ఈవో మారారు. పాలక మండలి కూడా మారిపోయింది. కానీ నిధులను మాత్రం కనీస స్థాయిలోనూ తెచ్చుకోలేకపోయారు. ప్రభుత్వం ఇస్తానన్న నిధులతో ఏఏ పనులు చేపట్టాలనే ప్రణాళికలను సైతం రెండున్నరేళ్ల క్రితమే రూపొందించారు. ఏ పనికి ఎంత ఖర్చవుతుందనే బడ్జెట్ అంచనాలూ రూపొందించారు. నమూనాలు సిద్ధం చేసి మరీ అన్ని సమస్యలూ పరిష్కరించేస్తున్నామంటూ హడావుడి చేశారు. పనులను చేపట్టి.. వాటికి సంబంధించిన బిల్లులను పెట్టుకుంటే ఆర్థికశాఖ నుంచి డబ్బులు విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఆలయంలో చేపట్టిన కొండరాళ్ల పనులకు సంబంధించిన రూ.2కోట్లకు పైగా బిల్లులు రావడానికే మూడేళ్లు పట్టింది. ఇక మిగతావి చేపడితే ఎప్పటికొస్తాయో తెలియని అయోమయం. అందుకే టెండర్లు పిలిచి పనులే చేపట్టకపోతే బిల్లులు పెట్టాల్సిన అవసరం ఉండదు. డబ్బులను ప్రభుత్వం విడుదల చేయల్సిన అవసరమూ లేదనే ధోరణిలో దుర్గగుడి అధికారుల తీరు ఉంటోంది.
నమూనాలనూ సీఎంతో ఆవిష్కరించి..
ప్రభుత్వం ఇస్తానని చెప్పిన డబ్బులతో చేపట్టే పనులు ఇవేనంటూ.. 2021 ఆరంభంలో అప్పటి వెలంపల్లి శ్రీనివాస్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను తీసుకొచ్చి మరీ ఈ నమూనాలను ఆయన చేతులమీదుగా ఆవిష్కరించారు. అంతే.. ఆ తర్వాత ఆ నమూనాల్లో ఉన్న భవనాల్లో ఒక్కటి కూడా కనీసం పునాదులు తవ్వింది లేదు. ఆ తర్వాత రెండేళ్లు ఈ నిధుల కోసం దుర్గగుడి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క రూపాయి కూడా రాలేదు. రూ.70 కోట్లలో రూ.6.5 కోట్లతో కొండరాళ్లు జారిపడకుండా శాశ్వతంగా పరిష్కరిస్తామంటూ ప్రకటించారు. దసరా వచ్చేస్తుండడం, మళ్లీ కొండరాళ్లు జారిపడే ప్రమాదం పొంచి ఉండడంతో హడావుడిగా రాక్‌మిటిగేషన్, వల ఏర్పాటు చేసే పనులను చేపట్టారు. వీటితో పాటు మరికొన్ని పనులకు రూ.2 కోట్ల వరకూ వెచ్చించారు. ఈ బిల్లులు ప్రభుత్వం నుంచి తెప్పించుకునేందుకే అవస్థలు పడ్డారు.
మళ్లీ ఇప్పుడు హడావుడి...
కొత్తగా పాలక మండలి రావడంతో మళ్లీ ఈ రూ.70 కోట్లతో పనులు చేపడతామంటూ తాజాగా ఛైర్మన్, ఈవో ప్రకటించారు. గతంలో రూపొందించిన నమూనాలు, ప్రణాళికలన్నీ పక్కన పెట్టేసి ఈసారి రూ.57 కోట్లతో కేవలం అన్నదాన భవనం, ప్రసాదాల తయారీ కేంద్రం నిర్మిస్తామంటూ ప్రకటించారు. వీటిలో రూ.30 కోట్లతో అన్నదానానికి జీప్లస్2 భవనం, మరో రూ.27 కోట్లతో ప్రసాదంపోటు భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన పనులకు ఆమోదం తెలిపామని, త్వరలో టెండర్లు పిలుస్తామని తాజాగా తెలిపారు. కానీ.. గతంలో టెండర్లు పిలిచి, ఈ రెండు భవనాల నిర్మాణం కోసం స్థలం ఎంపిక చేసి.. పనులు ఆరంభించిన తర్వాత కూడా దేవాదాయశాఖ మంత్రి మారడంతో పూర్తిగా ఆపేశారు. కొత్తగా మళ్లీ నమూనాలు తయారు చేసే ప్రక్రియ ఆరంభించారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా టెండర్లు, పనులు అంటున్నారు. కనీసం ఇప్పటికైనా చిత్తశుద్ధితో వీటిపై దృష్టి సారించి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా చేయగలిగితే భక్తులకు అన్నదానం అవస్థలు, ప్రసాదాల తయారీపై ప్రస్తుతం వెల్లువెత్తుతున్న విమర్శలు తగ్గుతాయి.
చేపడతామన్న పనులివి
శివాలయ ఆధునికీకరణ, అన్నదానం భవన నిర్మాణం, టోల్‌ప్లాజా, ప్రసాదాల తయారీ భవనం, కల్యాణ మండపం, కేశఖండనశాల, కొండరాళ్లు జారిపడకుండా శాశ్వతంగా రాక్ మిటిగేషన్, ఇనుప వల వేయడం, కొండపై పడే వర్షం నీరు కిందకు నేరుగా వెళ్లిపోయేందుకు ఓ కాలువ నిర్మాణం.
చేపట్టిన పనులు ఇవి: కొండరాళ్లు జారిపడకుండా రాక్ మిటిగేషన్, ఇనుప వల వేయడం.
ఇంకా రావాల్సిన నిధులు: రూ.67 కోట్లు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన