logo

లీజు పత్రాలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ల్లాలో ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇచ్చే సందర్భాల్లో తప్పనిసరిగా సంబంధిత ఒప్పంద ప్రతాలు రిజిస్ట్రేషన్‌ చేయించాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు స్పష్టం చేశారు.

Published : 21 Mar 2023 04:48 IST

స్పందనలో కలెక్టర్‌

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇచ్చే సందర్భాల్లో తప్పనిసరిగా సంబంధిత ఒప్పంద ప్రతాలు రిజిస్ట్రేషన్‌ చేయించాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ప్రభుత్వ స్థలాల్లోని చెరువులు, పెట్రోల్‌ బంకులు, మందుల దుకాణాలు, వంటి వాటితో పాటు టోల్‌గేట్‌లకు సంబంధించిన లీజ్‌ డీడ్‌లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించాలని చెప్పారు. ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఆధార్‌ నవీకరణ ప్రక్రియ జూన్‌ 14 వరకూ ఉచితంగా చేయించుకోవచ్చన్నారు. ఆసరా పథకం మూడో విడత కార్యక్రమాన్ని ఈనెల 25న , పాఠశాలల్లో రాగిజావ అందించే కార్యక్రమాన్ని ఈనెల 21న సీఎం చేతులమీదగా ప్రారంభిస్తారని, అందుకు అనుగుణంగా పాఠశాలల్లో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోషణ్‌ అభియాన్‌ పథకం ద్వారా ఏప్రిల్‌ 4 వరకూ పోషకాహార పక్షోత్సవాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ అపరాజితసింగ్‌, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, తదితరులు అర్జీలు స్వీకరించారు.


అర్జీలు ఇవీ..

అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేసి రూ.12 లక్షలు తీసుకున్న వారిపై తగు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ పోరంకి గ్రామానికి చెందిన సాయి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామ పరిధిలోని 3,500 ఎకరాలకు పైగా అన్యాక్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ అటవీ భూములను స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌ వినతిపత్రం సమర్పించారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు ఫిర్యాదు చేశారు.


క్యాజువల్‌ వేకెన్సీల ఎన్నికలకు సిద్ధం కావాలి

స్థానిక సంస్థల్లో క్యాజువల్‌ వేకెన్సీల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టర్‌ బంగ్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లాలో ఉయ్యూరు జడ్పీటీసీ, ఉంగుటూరు మండలం తేలప్రోలు ఎంపీటీసీ స్థానాలతో పాటు రెండు సర్పంచి, 32 వార్డు మెంబర్ల ఖాళీల భర్తీకై త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుందన్నారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ శివనారాయణరెడ్డి, డీఎల్‌పీవో జ్యోతిర్మయి, డీఎల్‌పీవో కార్యాలయ ఏవో సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని