logo

జగనన్న కాలనీకి జల గ్రహణం

మండలంలోని గొడవర్రు జగనన్న కాలనీకి జల గ్రహణం పట్టింది. లేఔట్‌లోకి నీరు వరదలా చేరడంతో చెరువును తలపిస్తోంది.

Published : 22 Mar 2023 03:27 IST

ఒరిగిన విద్యుత్తు స్తంభం

కంకిపాడు, కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని గొడవర్రు జగనన్న కాలనీకి జల గ్రహణం పట్టింది. లేఔట్‌లోకి నీరు వరదలా చేరడంతో చెరువును తలపిస్తోంది. దీనిలో గొడవర్రు, మద్దూరు, కాసరనేనివారిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 500 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. 110 గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏనుగుల కోడు పక్కనే ఉన్న నానమ్మ చెరువుకు చెందిన భూమిలో ప్లాట్లు వేసి లబ్ధిదారులకు అప్పగించారు. మెరక చేయలేదు. లోతట్టుగా ఉండడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేమని లబ్ధిదారులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిపారు. మెరకు చేస్తామనే హామీ, అధికారుల ఒత్తిడితో పనులు చేపట్టారు. పరిసర పంట భూముల కంటే పల్లపు ప్రాంతం కావడంతో వర్షపు నీటితో పాటు, పొలాల్లో మురుగు కాలనీలోకి చేరుతోంది. ప్రధాన, అంతర్గత రహదారుల అంచుల్లో వేసిన విద్యుత్తు స్తంభాలు కొన్ని ఒరిగి పోయాయి. ఇసుక, సిమెంట్‌, కంకర, సెంట్రింగ్‌, ఇనుము తదితర భవన నిర్మాణ సామగ్రి ముంపునకు గురైంది. నివాసం ఉంటున్నవారు కాలు బయట పెట్టడానికి వీల్లేకుండా పోయింది. పనులు ఎక్కడికక్కడ ఆగాయి.

లబ్ధిదారులు వద్దన్నా..: 10 ఏళ్లనాడే ఈ భూమిని ఇళ్ల స్థలాలుగా విభజించి లబ్ధిదారుల జాబితా ప్రకటించారు. ఊరికి దూరంగా లోతట్టుగా ఉండడంతో లబ్ధిదారులు అక్కడ గృహ నిర్మాణాలు చేపట్టడానికి ససేమిరా అన్నారు. దీనిపై ఏడేళ్లు వివాదం కొనసాగింది. జగనన్న కాలనీ పేరుతో మరోసారి గొడవర్రుతోపాటు మద్దూరు, కాసరనేనివారిపాలెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. వేసవి కావడంతో పనులు ఊపందుకున్న సమయంలో ముంపునకు గురవడంతో ఏమి చేయాలో లబ్ధిదారులకు పాలుపోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని