logo

పగలు వద్దు.. రాత్రి తవ్వుకోండి!

‘వారు మన వాళ్లు..! మనకు కావాల్సిన వారు..! పంటలు సరిగా పండటం లేదంట! చేపలు చెరువులు తవ్వుతారు. మీరు నిబంధనలు, అవీ ఇవీ అని అడ్డుపుల్ల వేయకండి! నేను పై అధికారులకు చెబుతాను.

Updated : 23 Mar 2023 13:10 IST

ఇదీ అక్రమార్కులకు అధికారుల సూచన
చెరువులుగా మారుతున్న పంట పొలాలు
అనుభవదారుల పేరుతో ప్రభుత్వ భూముల ఆక్రమణ

ఈనాడు, అమరావతి: ‘వారు మన వాళ్లు..! మనకు కావాల్సిన వారు..! పంటలు సరిగా పండటం లేదంట! చేపలు చెరువులు తవ్వుతారు. మీరు నిబంధనలు, అవీ ఇవీ అని అడ్డుపుల్ల వేయకండి! నేను పై అధికారులకు చెబుతాను. వారిని ఇబ్బంది పెట్టకండి..!’

ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి ఆదేశం ఇది!

‘సార్‌ చెప్పారు.. మీరు తవ్వుకోండి.. కానీ.. పగలు వద్దు.. రాత్రి మాత్రమే తవ్వుకోండి.. పగలైతే గ్రామస్థులు అడ్డుకుంటారు. ఇతర ఇబ్బందులు ఉంటాయి. మేం ఏం సమాధానం చెబుతాం..! అధికారుల ఫార్మాలిటీస్‌ మామూలే... తెలుసు కదా..!’

ఓ అధికారి ఇచ్చిన భరోసా ఇది.


పక్క చిత్రంలోని పొలం చూశారు కదా! ఒక పక్క సాగు నీటి కాలువ, మరోపక్క డ్రైనేజీ ఉండేది. పంటలు పండే బంగారు భూములు. ఎంచక్కా రాత్రికి రాత్రే చేపల చెరువుగా మారిపోయింది. ఆక్వా జోన్‌, సీఆర్‌జడ్‌ లాంటి నిబంధనలు అవసరం లేదు. మత్స్యశాఖ నుంచి అనుమతులు అవసరం లేదు. రెవెన్యూ శాఖ నుంచి అనుమతి లేదు. కానీ రాత్రికి రాత్రే తవ్వేశారు. ఇక కాలువలకు నీరు విడుదల చేస్తే.. చెరువుల్లో నింపి ఆక్వా కల్చర్‌ సాగు చేయడమే.. రూ.లక్షల్లో లీజుకు ఇవ్వడమే..!  కావాల్సిందల్లా అధికారి పార్టీ నేతల హామీ మాత్రమే.

ఇదీ తీర ప్రాంత మండలాల్లో పరిస్థితి. ఇష్టానుసారంగా చేపల చెరువులు తవ్వేస్తున్నారు. దివిసీమ ప్రాంతంలోని నాగాయలంక మండలంలో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. కమ్మనోలు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 210లో దాదాపు 30 ఎకరాలు చేపల చెరువులు తవ్వారు. దీనిపై కొంత మంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు వ్యాపారులతో కుమ్మక్కై రాత్రి పూట తవ్వుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారు. దీంతో రాత్రి పూట ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో ఇవి తవ్వేశారు. తహసీల్దారు, ఆర్డీవోలకు, స్పందనలో ఫిర్యాదు చేసినా కనీస చర్యలు లేవు. దీంతో విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబరు 24లోనూ సుమారు 20 ఎకరాలు తవ్వేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, ఆయన తనయుడు ఇక్కడ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వారు చెబితే ఎలాంటి అనుమతులు లేకపోయినా తవ్వకాలు జరిగిపోతాయి. ప్రతిపక్ష పార్టీ అభిమానులు తవ్వితే మాత్రం కేసులు నమోదవుతాయి. ఈ ప్రాంతం ఆక్వా జోన్‌ పరిధిలో లేకపోయినా చెరవుల తవ్వకాలు జరపడం విశేషం. చెరువులు ఉంటేనే ఆక్వాజోన్‌గా పరిగణిస్తామని అధికారులు చెబుతుండటంతో పంట పొలాలు తవ్వేస్తున్నారు. వీటిలో చేపలు, రొయ్యలు సాగు చేస్తారు. ఈ భూములు ఏడబ్ల్యూడీ భూములు కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధీనంలోని భూముల్లో కబ్జాలో ఉండి తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ భూములకు రికార్డులు మార్చి అనుభవదారులుగా కొంతమంది రైతులు పేర్లు చేర్చి ధ్రువీకరణ ఇస్తున్నారు. దీనదయాళపురం గ్రామానికి చెందిన సర్వే నెంబరు 831, 832 భూముల్లోనూ అనుభవదారులు ధ్రువీకరణ పత్రం అందజేసి విద్యుత్తు మీటర్లకు అనుమతి తీసుకున్నారు. అలాంటి భూములే సర్వేనెంబరు 833, 834లలో ఆధీనంలో ఉన్న మరికొంత మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వారికి ఎన్‌ఓసీ తిరస్కరించారు. బ్యాంకుల్లోనూ తనకా పెట్టి భారీగా రుణాలు పొందారు. సముద్ర గట్టు లోపలి భూములకు ఎలాంటి రుణాలు అందించే పరిస్థితి లేదు. ఇవి ముంపు ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఓ ప్రైవేటు బ్యాంకులో 1బీ అడంగళ్‌ సమర్పించి రుణాలు తీసుకున్నారు. వీటికి రెవెన్యూకు కమిషన్లే ప్రామాణికమనే విమర్శలు ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ గ్రామీణం, నందివాడ మండలాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు జరపడమే కాకుండా అక్కడ మట్టి పట్టణాలకు తరలిపోతోంది. ఇక్కడ ఓ ప్రజాప్రతినిధి మాటకు తిరుగులేకుండా పోయింది. ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ తవ్వకాలను ప్రశ్నించినందుకు పోలీసు కేసు నమోదు చేశారు. పెడన, బందరు అవనిగడ్డ నియోజకవర్గాల్లోనూ ఇష్టారాజ్యంగా మారింది.

నిబంధనల ఉల్లంఘన

కొత్తగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వాలంటే జిల్లా స్థాయి కమిటీ నుంచి అనుమతి పొందాలి. డీఎల్‌సీలో చర్చించి సమీక్షించిన తర్వాత గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. గుడివాడ నియోజకవర్గం పరిధిలో భీమవరానికి చెందిన వ్యాపారులు తవ్వకాలు చేపట్టారు. వందల ఎకరాలు అనధికారికంగా చెరువులుగా మారుతున్నాయి. దీనిపై అధికారులను వివరణ కోరితే తమ దృష్టికి రాలేదంటూ సమాధానమిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు