తెదేపా కార్యకర్తలకు దిశా నిర్దేశం
‘మీరు ప్రసంగాలు చేయడం కాదు.. మీ క్లస్టర్‌లో ఎలాంటి కృషి చేశారు.. మీ అనుభవాలు ఏమిటి..? వాటిని ఇతర క్లస్టర్ల కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా చెప్పండి..!’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇన్‌ఛార్జులను సున్నితంగా మందలించారు.
సాంకేతికతపై అవగాహన
టెలిగ్రామ్ బాట్, ఆర్‌టీఎస్, వాట్సాప్‌పై శిక్షణ
ఈనాడు, అమరావతి
‘మీరు ప్రసంగాలు చేయడం కాదు.. మీ క్లస్టర్‌లో ఎలాంటి కృషి చేశారు.. మీ అనుభవాలు ఏమిటి..? వాటిని ఇతర క్లస్టర్ల కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా చెప్పండి..!’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇన్‌ఛార్జులను సున్నితంగా మందలించారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడాలని, సాంకేతికత, సామాజిక మాధ్యమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తెదేపా జోన్3 సమీక్షా సమావేశంలో నేతలకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం శుక్రవారం మంగళగిరిలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన వినూత్నంగా జరిగింది. ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నేతలను చైతన్యం చేసేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. మొత్తం జోన్3లో అయిదు జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని నియోజకవర్గ కార్యకర్తలు, ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 34 నియోజకవర్గాల నుంచి 2,450 మంది ఇన్‌ఛార్జులకు 2,351 మంది హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ, గుంటూరు ఎంపీ హాజరుకాలేదు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాలకు చెందిన ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. పోలింగు బూత్ స్థాయి, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి మండలాన్ని యూనిట్‌గా, క్లస్టర్, సెక్షన్‌గా మూడు అంచెలుగా సారథులను నియమించారు. ప్రతి 30 కుటుంబాలకు, 50 మంది ఓటర్లుకు ఒకరు చొప్పున ఇన్‌ఛార్జిని నియమించారు. వారి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా పరిశీలన, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వీటి పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి చేరాల్సి ఉంది. ఈ సమీక్షలో ఇంటింటికి తెదేపా, బాదుడే బాదుడు, గౌరవ సభలు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. ఓటర్ల జాబితా పరిశీలనలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది.
సామాజిక మాధ్యమాలపై చైతన్యం...
మొదట సమావేశానికి హాజరైన కార్యకర్తలు రిజిస్ట్రేషన్ అనంతరం టెలిగ్రామ్ బాట్ అనే యాప్ ద్వారా హాజరు తీసుకున్నారు. దీనిపై శిక్షణ కల్పించారు. సామాజిక మాధ్యమాల ఇన్‌ఛార్జి చింతకాయల విజయ్ అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్‌లో యాప్‌ను ఏవిధంగా ఉపయోగించాలి..? అనే అంశంపై దాదాపు గంటసేపు పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. దీంతో మధ్నాహ్నానికి 90శాతం నమోదు చేసుకున్నారు. అనంతరం రియల్‌టైం స్ట్రాటజీ (ఆర్‌టీఎస్) అనే అంశంపై ఆ బృందం అవగాహన కల్పించింది. గ్రామాల్లో ఓటర్ల జాబితాపై పరిశీలన గురించి ఎస్ రాజశేఖర్ అవగాహన కల్పించారు. రాష్ట్రంలో 50శాతం పరిశీలన పూర్తయిందని, మిగిలినవారు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కుటుంబ సాధికారిక సారథి
ఈ సారి వినూత్నంగా కుటుంబ సాధికారిక సారథి నియామకాలు చేపట్టాలని సూచించారు. ప్రతి 30 కుటుంబాలకు 100 ఓట్లకు ఒక సారథిని నియమించాల్సి ఉంది. దీనిలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని తప్పనిసరిగా 50 శాతం మంది మహిళలు ఉండాలని, ఈ సారథి కీలకంగా వ్యవహరించాలని సూచించారు.
* రాష్ట్రంలో ఓటర్ల జాబితా పరిశీలనలో ప్రథమ స్థానంలో నిలిచిన మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని ఉమా మాట్లాడుతూ 26 వేల బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగించామని వివరించారు. గ్రామాల్లో పర్యటిస్తే వైకాపా బోగస్ ఓట్ల చిట్టా బయట పడిందన్నారు.
అంతా చంద్రబాబు ఘనతే...
ఈ సమావేశంలో పంచుమర్తి అనురాధ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. ఆమెను ప్రసంగించాలని చంద్రబాబు కోరగా తన విజయం చంద్రబాబు ఘనతేనని, తనది కాదని స్పష్టం చేశారు. తాను అసలు ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు