logo

ఎక్కడి పనులక్కడే..!

‘విజయవాడకు రైల్‌ నీర్‌ ప్రాజెక్టు మంజూరై ఇప్పటికి సరిగ్గా పదేళ్లు దాటింది. 2013 బడ్జెట్‌లో దేశంలోని ఏడు రాష్ట్రాలకు ఒకేసారి రైలు నీర్‌ ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ఆరంభిస్తామంటూ ప్రకటించారు.

Published : 25 Mar 2023 04:16 IST

రైల్‌ నీర్‌కు... దశాబ్దం దాటింది
2013లో మంజూరైనా ఇప్పటికీ ఆరంభం కాలేదు
ఈనాడు, అమరావతి

‘విజయవాడకు రైల్‌ నీర్‌ ప్రాజెక్టు మంజూరై ఇప్పటికి సరిగ్గా పదేళ్లు దాటింది. 2013 బడ్జెట్‌లో దేశంలోని ఏడు రాష్ట్రాలకు ఒకేసారి రైలు నీర్‌ ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ఆరంభిస్తామంటూ ప్రకటించారు. కానీ ఒక్క విజయవాడ రీజియన్‌లో తప్ప మిగతా దేశంలోని ఆరు రాష్ట్రాల్లోనూ రైల్‌ నీర్‌ కార్యకలాపాలు అన్నట్టుగానే ఆరంభించారు. విజయవాడ రీజియన్‌లో మాత్రం రకరకాల కారణాలతో ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఆపేస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టును ఎప్పటికి పూర్తి చేస్తారో, ఉత్పత్తిని ఎప్పుడు ఆరంభిస్తారో.. సంబంధిత అధికారులకు కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. తాజాగా మల్లవల్లిలో కడుతున్న ప్రాజెక్టు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సగం నిర్మాణం పూర్తి చేసి ఎక్కడి పరికరాలు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.’
దక్షిణ మధ్య రైల్వేలోనే కీలకమైన విజయవాడ డివిజన్‌ పరిధిలో రైల్‌ నీర్‌ ప్రాజెక్టు చాలా అవసరమని 2010లో ప్రతిపాదన పెట్టారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రాజెక్టు పెట్టేందుకు 2013లో కేంద్రం పచ్చజెండా ఊపింది. కానీ ఆరంభం నుంచి ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది. ఆరంభంలో విజయవాడకు సమీపంలోని కృష్ణా కెనాల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రాజెక్టు నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. స్థలం ఎంపిక చేయడంతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకొచ్చారు. భూగర్భ పరీక్షలు కూడా ఇక్కడ సఫలమయ్యాయి. పక్కనే కృష్ణా నది ఉండడంతో నీటికి కొరత ఉండదని భావించారు. కానీ గుత్తేదారు సంస్థతో నిర్వహణ ఒప్పందం విషయంలో విభేదాలు తలెత్తడంతో ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఇక అక్కడి నుంచి ప్రాజెక్టు విషయంలో ఆలస్యం జరుగుతూనే వచ్చింది. ఎట్టకేలకు గత తెదేపా ప్రభుత్వం చొరవ తీసుకుని.. కృష్ణా జిల్లా మల్లవల్లి మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో రైల్‌ నీర్‌ ప్రాజెక్టు కోసం 2017లో స్థలాన్ని కేటాయించింది.  

ప్రారంభిస్తామని చెప్పి మూడేళ్లవుతోంది..

మల్లవల్లిలో రూ.100 కోట్లతో 4254 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్‌ నీరు ప్రాజెక్టు నిర్మాణం ఘనంగా ఆరంభించారు. 2019 డిసెంబర్‌ నాటికి నిర్మాణం 70 శాతం పూర్తి చేశారు. భూగర్భంలో బోర్లు వేసి అన్ని మోటార్లు బిగించారు. బాటిళ్లకు సంబంధించిన ప్యాకింగ్‌ కోసం ఒక కీలకమైన యంత్ర పరికరం మాత్రం విదేశాల నుంచి రావాల్సి ఉందని చెప్పారు. అది వచ్చిన వెంటనే 2020 మార్చిలో ఇక్కడి నుంచి ఉత్పత్తి ఆరంభిస్తామంటూ వెల్లడించారు. ఇప్పటికి మూడేళ్లవుతున్నా ప్రాజెక్టు ఎక్కడ ఆగిందో అక్కడే ఉండిపోయింది. మిగతా 30 శాతం పనులు పూర్తి చేయకుండా అలాగే వదిలేశారు.

ప్రస్తుతం అత్యంత దయనీయం...

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు గుత్తేదారు సంస్థలతో కలిసి సంయుక్తంగా రైల్‌నీర్‌ ప్రాజెక్టును నిర్వహించేలా మల్లవల్లిలో నిర్మాణం చేపట్టారు. కానీ మిగిలిన పనులు పూర్తి చేయకుండా ఎందుకు వదిలేశారనే దానికి అధికారుల వద్ద కూడా సమాధానం లేకపోవడం గమనార్హం. ఇదిగో ప్రాజెక్టు వచ్చేస్తోంది.. అదిగో ఉత్పత్తి ఆరంభమైపోతోందంటూ గత రెండేళ్లుగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఊసే లేకుండా గతేడాది నుంచి పూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం విలువైన పరికరాలతో ఉన్న ఈ ప్రాజెక్టు భవనాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రోజుకు 80వేల బాటిళ్ల వరకూ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఏకైక రైల్‌ నీరు ప్రాజెక్టు కూడా విజయవాడదే కావడం గమనార్హం. ఈ ప్రాజెక్టు చుట్టూ ఉన్న 400 కి.మీ పరిధిలోని కీలకమైన రైల్వేస్టేషన్లన్నింటికీ ఇక్కడి నుంచే బాటిళ్లను ఉత్పత్తి చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని