logo

ఆ విద్యార్థులకు ప్రత్యేకం

రాష్ట్రంలో ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరవనున్న ప్రత్యేక అవసరాల విద్యార్థులకు పలు మినహాయింపులు లభించాయి.

Published : 25 Mar 2023 04:14 IST

పదో తరతి పరీక్షలో మినహాయింపులు
తిరువూరు, ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

భవిత కేంద్రంలో విద్యార్థులు

రాష్ట్రంలో ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరవనున్న ప్రత్యేక అవసరాల విద్యార్థులకు పలు మినహాయింపులు లభించాయి. వీరు పరీక్షల్లో ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను తల్లిదండ్రులు, ప్రత్యేక బోధకులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తేవడంతో స్పందించింది. గతంలో పదో తరగతి పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాల విద్యార్థులకు కొన్ని మినహాయింపులున్నా అంతంతమాత్ర ప్రయోజనమే చేకూరేది. ఫలితంగా శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే విద్యార్థుల్లో చాలామంది మధ్యలోనే చదువు ఆపేసేవారు. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్యా శాఖ పలు సదుపాయాలు కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ప్రత్యేకావసరాల విద్యార్థులు 77 మంది రెగ్యులర్‌, 50 మంది ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ఆ సదుపాయాలు ఇవే: గతంలో అంధులు, రెండు చేతులు లేనివారికి మాత్రమే పరీక్షల్లో సహాయకులను అనుమతించే వారు. ప్రస్తుత కొత్త జీవో మేరకు వినికిడి లోపమున్న వారికి మినహా ప్రభుత్వం గుర్తించిన 20 రకాల శారీరక వైకల్యంతో బాధపడే విద్యార్థులందరూ సహాయకులను సమకూర్చుకోవచ్చు.

దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రుసుంలో పలు రాయితీలతో పాటు ఆర్థోపెడిక్‌ సమస్యతో బాధపడే వారు ఏదైనా ఒక లాంగ్వేజ్‌ పరీక్ష రాయనవసరం లేదు. ఆభ్యసన వైకల్యం ఉన్నవారికి ఆంగ్ల పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు.

అంధులకు ఒక లాంగ్వేజ్‌ రాయనవసరం లేకుండా, మిగిలిన ఐదు సబ్జెక్టులలో 20 మార్కులు (ఒక్కొక్క దాంట్లో) తెచ్చుకుంటే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. వినికడి లోపమున్న వారికి రెండు లాంగ్వేజ్‌ పరీక్షలు రాయనవసరం లేదు. మూగవారు వారు ఆరు సబ్జెక్టుల్లో ఒక్కొక్క దాంట్లో 20 మార్కుల చొప్పున, మాసిక దివ్యాంగులు అన్నింటిలోనూ 18 మార్కులు చొప్పున తెచ్చుకుంటే ఉత్తీర్ణులయ్యేలా వెసులుబాటు కల్పించారు.

వెసులుబాటు వినియోగించుకోండి

ఈ విద్యా ఏడాదిలో పదో తరగతి పరీక్షలు రాసే ప్రత్యేకావసరాల విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, మినహాయింపులు వారి విద్యార్హత పెంచుకునేందుకు చాలా ఉపయోగపడతాయి. భవిత కేంద్రాల నుంచి 77 మంది పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. మరో 50 మంది ప్రైవేటుగా రాస్తున్నారు. వీరందరికీ విద్యా శాఖ తరపున మా వంతు సహాయ, సహకారాలు అందిస్తున్నాం.-ఎల్‌.వెంకటేశ్వరరావు, జిల్లా సహిత విద్య సమన్వయకర్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని