logo

మోదీ కక్ష పూరిత పాలన: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి వస్తున్న ప్రజాదరణను చూసి భాజపా నేతల్లో వణుకు ప్రారంభమైందని, అందుకే ఆయనపై అక్రమంగా సస్పెన్షన్‌ వేటు వేశారని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు.

Published : 25 Mar 2023 04:14 IST

నిరసన వ్యక్తం చేస్తున్న నరహరశెట్టి నరసింహారావు, గురునాథం, పీటర్‌ జోసెఫ్‌, వేముల శ్రీనివాస్‌ తదితరులు

గవర్నర్‌పేట(విజయవాడ), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి వస్తున్న ప్రజాదరణను చూసి భాజపా నేతల్లో వణుకు ప్రారంభమైందని, అందుకే ఆయనపై అక్రమంగా సస్పెన్షన్‌ వేటు వేశారని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు, వి.గురునాథం పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ అక్రమ సస్పెన్షన్‌కు నిరసనగా శుక్రవారం విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌ వద్ద నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని, భాజపా ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మోదీ కక్ష పూరితంగా పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు పీటర్‌ జోసెఫ్‌, వేముల శ్రీనివాస్‌, గౌస్‌, జాన్‌, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’

మోదీ, అమిత్‌షా, భాజపా శక్తులు రాహుల్‌గాంధీపై తప్పుడు కేసులు పెట్టి పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు వేయించడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని ఏఐసీసీ సభ్యుడు కొలనుకొండ శివాజీ, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీలు విమర్శించారు. ఈమేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అదానీ ఆర్థిక కుంభకోణాలపై ప్రధానమంత్రి మోదీకి ఉన్న ఆసక్తి ఏమిటి? ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి? అంటూ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో, ఇతర వేదికలపై ప్రశ్నించారన్నారు. దానికి సమాధానం చెప్పకుండా పార్లమెంటులో రాహుల్‌గాంధీని మాట్లాడకుండా అడ్డుకునేందుకు ఇలా చేయడం దేశ ప్రజలను విస్తు గొలిపిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అదానీ ఆర్థిక అక్రమాలపై ప్రధాని సమాధానం చెప్పాలని, దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని నియమించాలని కొలనుకొండ శివాజీ, సుంకర పద్మశ్రీలు కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని