logo

ప్రేక్షకుల హృదయాల్లో సావిత్రి స్థానం సుస్థిరం

తెలుగు ప్రేక్షకులు, ప్రజల హృదయాల్లో మహానటి సావిత్రి స్థానం సుస్థిరమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

Published : 26 Mar 2023 05:06 IST

జస్టిస్‌ శివశంకరరావు, జయలక్ష్మి దంపతులకు పురస్కారం

అందిస్తున్న విష్ణు, రమా సత్యనారాయణ, విజయలక్ష్మి

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : తెలుగు ప్రేక్షకులు, ప్రజల హృదయాల్లో మహానటి సావిత్రి స్థానం సుస్థిరమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం, సంక్షేమ సంఘం 16 వసంతాల వేడుకలు నిర్వహించారు. మహానటి సావిత్రి జీవన సాఫల్య పురస్కారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బులుసు శివశంకరరావు, జయలక్ష్మి దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. తన నటనతో సినీ ప్రేక్షకులకు మైమరిపించిన మహానటి సావిత్రి అని కొనియాడారు. సంఘ సేవకురాలు అని, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చిన మహనీయురాలన్నారు. ఆమె పేరుతో జీవన సాఫల్య పురస్కారాన్ని మహోన్నత వ్యక్తిత్వం గల న్యాయమూర్తి శివశంకరావు దంపతులకు ఇవ్వడం సముచితమన్నారు. శాతవాహనా కళాశాల కరస్పాండెంట్‌ నిడుమోలు రమా సత్యనారాయణ మాట్లాడుతూ... కళాపీఠం ఆధ్వర్యంలో ఏటా ఒక ప్రముఖుడిని సత్కరించి, పురస్కారం అందించడం అభినందనీయం అన్నారు. పురస్కార గ్రహీత జస్టిస్‌ శివశంకరావు మాట్లాడుతూ... చలనచిత్ర సీమలో మహానటిగా పేరొందిన సావిత్రి పేరుతో తమకు పురస్కారం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి.. కళాపీఠం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా విశ్రాంత పోలీసు అధికారి సత్యనారాయణ, ఆధ్యాత్మికవేత్త వేముల హజరత్తయ్య గుప్తా, జ్యోతిష్యురాలు ప్రసూనా రామన్‌, సాహితీవేత్త నిడుమోలు సుమ, న్యాయవాది శివశంకర్‌ప్రసాద్‌, గాయకుడు ఆర్‌.ఎల్‌.బాలాజీ కుమార్‌, వ్యాఖ్యాత అశోక్‌ ఆనంద్‌, కళాపీఠం బాధ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని