logo

దుర్గగుడి దుకాణదారుల ఆందోళనతో.. ఉద్రిక్తత

విజయవాడ దుర్గగుడి ఆధ్వర్యంలోని కనకదుర్గానగర్‌లో దుకాణదారులు నిర్వహిస్తున్న ఆందోళన శనివారం ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 26 Mar 2023 05:14 IST

పెట్రోలు పోసుకున్న నిరసనకారుడు
నీరు పోయడంతో తప్పిన ప్రమాదం
కనకదుర్గానగర్‌లో ఘటన

పెట్రోలు పోసుకున్న వ్యక్తిని అడ్డుకుంటూ..

విజయవాడ(ఇంద్రకీలాద్రి), న్యూస్‌టుడే : విజయవాడ దుర్గగుడి ఆధ్వర్యంలోని కనకదుర్గానగర్‌లో దుకాణదారులు నిర్వహిస్తున్న ఆందోళన శనివారం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు దుకాణానికి నెలకు రూ.1.06 లక్షల చొప్పున అద్దె చెల్లించే విధంగా గతేడాది 24 దుకాణాలను అద్దెకు ఇచ్చారు. మహామండపం ఐదో అంతస్తులో ఉన్న పదిమందికి వాటిని కేటాయించేందుకు ఈ స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. అదే స్థలంలో 24 దుకాణాలను ఏర్పాటు చేయడంతో వాటి సైజు తగ్గిపోయింది. అద్దె తగ్గించకుండా లాటరీ విధానంలో ఈవో భ్రమరాంబ, అప్పటి పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు వారికి దుకాణాలు కేటాయించారు. కనకదుర్గానగర్‌ చుట్టూ ఆక్రమణదారులు అద్దె చెల్లించకుండా ఇదే వ్యాపారం చేస్తుంటే తమ వద్ద అద్దె వసూలు చేయడమే కాకుండా పట్టాలు కట్టామని చెప్పి అధికారులు తమను వేధిస్తున్నారంటూ వ్యాపారులు మూడు రోజులుగా షాపులను మూసివేశారు. దుకాణ యజమానులతోపాటు వాటిల్లో పనిచేసే వారితో కలిసి ఆందోళన చేస్తుండగా సురేష్‌ అనే వ్యక్తి శరీరంపై పెట్రోలు పోసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే దుకాణ యజమానులు అతడిపై బక్కెట్లతో నీరు పోయడంతో ప్రమాదం తప్పింది. 15 ఏళ్లుగా దుకాణ యజమానులు ఇచ్చిన జీతంతో బతుకుతున్నామని, మూడు రోజులుగా పరిస్థితి మారడంతో అధికారులు కళ్లు తెరుస్తారని చెప్పి ఇలా ప్రవర్తించినట్లు సురేష్‌ చెప్పారు.

పాలకమండలి ఛైర్మన్‌ భరోసా

దుకాణదారుల సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరించేందుకు దుర్గగుడి ఈవో భ్రమరాంబతో మాట్లాడతామని, ఇటువంటి ఘటనలు దుర్గగుడి ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు పేర్కొన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణను కలిసి తమ గోడును తెలిపామని, దుకాణదారులు ఛైర్మన్‌ వద్ద వాపోయారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బుద్ధా రాంబాబు, సింహాచలం, మాధవీకృష్ణ వ్యాపారులను సముదాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని