logo

గుండెపోటుతో ల్యాబ్‌ అసిస్టెంట్‌ మృతి

ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు ఉన్నత పాఠశాలలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రామిశెట్టి వెంకటేశ్వరరావు(51) శనివారం గుండెపోటుతో మరణించారు. 108కు ఫోన్‌ చేసినా స్పందించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు..

Published : 26 Mar 2023 05:14 IST

108కు ఫోన్‌ చేసినా స్పందించని సిబ్బంది

వెంకటేశ్వరరావు (పాత చిత్రం)

చందర్లపాడు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు ఉన్నత పాఠశాలలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రామిశెట్టి వెంకటేశ్వరరావు(51) శనివారం గుండెపోటుతో మరణించారు. 108కు ఫోన్‌ చేసినా స్పందించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.. వెంకటేశ్వరరావు పాఠశాలలో విధులు నిర్వహిస్తుండగా సాయంత్రం 3.30- 4.00 గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు అతనిని స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటేశ్వరరావు స్వగ్రామం నందిగామ మండలం కేతవీరునిపాడు కాగా.. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో నివాసం ఉంటున్నారు. సంవత్సరం కిత్రం జరిగిన బదిలీల్లో ఈ పాఠశాలలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రైవేటు అంబులెన్సే దిక్కు

స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి తీసుకెళ్లడానికి పాఠశాలలో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగి 108కి ఫోన్‌ చేశారు. అర గంట దాటినా వాహనం రాకపోడంతో నందిగామలోని ఓ ప్రైవేటు అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి రప్పించారు. అదే 108 వాహనం సకాలంలో వచ్చినట్లయితే ప్రాణాలు నిలిచేవేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని