స్మృతివనానికి.. నిధుల కొరత
గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమరావతిలో చేపట్టిన అంబేడ్కర్ స్మృతివనాన్ని కాదని, ప్రస్తుత ప్రభుత్వం విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ)లో చేపట్టిన ప్రాజెక్టుకు నిధుల సమస్య ఎదురైంది.
ఏప్రిల్‌లో ప్రారంభం లేనట్లే
ఈనాడు, అమరావతి
గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమరావతిలో చేపట్టిన అంబేడ్కర్ స్మృతివనాన్ని కాదని, ప్రస్తుత ప్రభుత్వం విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ)లో చేపట్టిన ప్రాజెక్టుకు నిధుల సమస్య ఎదురైంది. అత్యంత విలువైన స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కేవలం ఏడాదిన్నరలో ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటలు నీటిమూటలు అయ్యాయి. నిర్మాణం ప్రారంభించిన తర్వాత అంబేడ్కర్ మూడో జయంతి రాబోతోంది. కానీ 50 శాతం పనులు కూడా పూర్తికాలేదు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు నిధుల మంజూరులో వెనకడుగు వేస్తున్నారు. వాస్తవానికి 2022 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున ప్రారంభించాల్సి ఉంది. 2023 ఏప్రిల్ 14 వస్తోంది. ఇంకా సరిగ్గా 20 రోజులు మాత్రమే ఉంది. వారం వారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తున్నారు. కానీ పనుల్లో మాత్రం వేగం లేదు. ఈ ఏడాది ప్రారంభం లేనట్లేనని అధికారులు వ్యాఖ్యానించారు. ప్రతిష్ఠాత్మకమైన 125 అడుగులు ఎత్తు ఉన్న కాంస్య విగ్రహం పూర్తి కావడానికి ఇంకా కనీసం 70 రోజులు పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఏపీఐఐసీ, ఎస్సీ కార్పొరేషన్, పురపాలక శాఖల మధ్య మూడు ముక్కలాటలాగా మారింది.
విజయవాడ బందరు రహదారిలో ఉన్న జలవనరుల శాఖకు చెందిన 18 ఎకరాల్లో స్వరాజ్యమైదానంలో అంబేడ్కర్ స్మృతి వనం పేరుతో భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. దీనికి ముఖ్యమంత్రి స్వయంగా వర్చువల్ విధానంలో 2020 జులై 8న శంకుస్థాపన చేశారు. 2021 ఏప్రిల్ నాటికే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. స్వరాజ్యమైదానంలో ఎగ్జిబిషన్, ప్రతి ఏడాది పుస్తక ప్రదర్శన నిర్వహించేవారు. ఇక్కడ కొన్ని కార్యాలయాలు, రైతుబజారు, పాలిటెక్నిక్ కళాశాల ఉండేవి. వాటిని తరలించడానికే ఏడాది పట్టింది. ఎట్టకేలకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించి జలవనరుల శాఖ నుంచి భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించారు. మొత్తం 25 ఎకరాల వరకు ఉండగా 18.81 ఎకరాలను స్వాధీనం చేశారు. ఇక్కడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, ఒక కన్వెన్షన్ సెంటర్, వాకింగ్ ట్రాక్, పార్కు, మ్యూజియం నిర్మాణం చేయాల్సి ఉంది. భారీ విగ్రహం కిందనే మ్యూజియం రావాల్సి ఉంది. దీన్ని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించగా వారు ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో టెండర్లు పిలవగా ప్రొద్దుటూరుకు చెందిన కేపీసీ సంస్థ టెండర్ దక్కించుకుంది. వీటి నిర్మాణ పర్యవేక్షణ పురపాలక శాఖ చేస్తోంది. ఏశాఖ పరిధిలోకి వస్తుందో మాత్రం తెలియడం లేదు. నిధులను ఏపీఐఐసీకి అందించాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ, పురపాలక శాఖ సంయుక్తంగా నిధులు సమకూర్చాల్సి ఉందని తెలిసింది.
ప్రాజెక్టుపేరు: అంబేడ్కర్ స్మృతి వనం
ప్రత్యేకత: 125 అడుగుల కాంస్య విగ్రహం
ఎక్కడ..? స్వరాజ్యమైదానం(పీడబ్ల్యూడీ)
కాంట్రాక్టు వ్యయం: రూ.249కోట్లు
గుత్త సంస్థ: కేపీసీ గడువు: 14 నెలలు
అదనంగా తీసుకున్న సమయం: 24 నెలలు
ఆకృతుల్లో జాప్యం!
అంబేడ్కర్ స్మృతి వనం ఆకృతులు, ఖరారులో జాప్యం జరిగింది. వీటిని ఏపీఐఐసీ నొయిడాకు చెందిన సంస్థకు అప్పగించింది. గత ప్రభుత్వంలో అమరావతిలో నిర్మాణం తలపెట్టిన స్మృతి వనానికి చెందిన ఆకృతులను ఇక్కడ ఖరారు చేయలేదు. 125 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు గుత్త సంస్థ మరో నోటిఫికేషన్ ఇచ్చి మైదానంలో నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. 2022 జనవరిలో మైదానంలో డ్రిల్లింగ్ నిర్వహించి మట్టి పరీక్షలు చేశారు. నల్లమట్టి రావడంతో ఫైల్స్ ఫౌండేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. మొత్తం 30వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంటుంది. తాజాగా విగ్రహం కాలు భాగాలను అమర్చారు. విగ్రహం కింది భాగం భవనంలో ఒక రెస్టారెంట్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, మినీ థియేటర్, ఎగ్జిబిషన్, మ్యూజికల్ ఫౌంటెన్ నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం విగ్రహ నిర్మాణం 50 శాతం కూడా పూర్తికాలేదు. అధికారులు మాత్రం నిధుల సమస్య లేదని, జులై నాటికి విగ్రహం పూర్తవుతుందని చెబుతున్నారు. ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని