logo

కేవీఆర్‌ రచనలతో సామాజిక చైతన్యం

అభ్యుదయ విప్లవ భావజాల వ్యాప్తికి రచనా మార్గాన్ని ఎంచుకుని, జీవితకాలమంతా తన రచనల ద్వారా సామాజిక చైతన్యానికి కె.వి.రమణారెడ్డి (కేవీఆర్‌) దోహదపడ్డారని చరిత్రకారులు, రచయిత వకుళాభరణం రామకృష్ణ పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 04:47 IST

‘మహోదయం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రామకృష్ణ,
వెంకటేశ్వరప్రసాద్‌, ఇందిర, చెంచయ్య, సీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, వసుంధర

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : అభ్యుదయ విప్లవ భావజాల వ్యాప్తికి రచనా మార్గాన్ని ఎంచుకుని, జీవితకాలమంతా తన రచనల ద్వారా సామాజిక చైతన్యానికి కె.వి.రమణారెడ్డి (కేవీఆర్‌) దోహదపడ్డారని చరిత్రకారులు, రచయిత వకుళాభరణం రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గవర్నర్‌పేటలోని ఐ.ఎం.ఎ. హాలులో కె.వి.రమణారెడ్డి గురజాడ రచనలపై సమగ్ర విశ్లేషణ గ్రంథం ‘మహోదయం’ను ఆవిష్కరించారు. అలాగే వకుళాభరణం రామకృష్ణ రచించిన ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’, కె.వి.రమణారెడ్డి, శ్రీశ్రీలపై రచించిన ‘అనితర సాధ్యం కేవీఆర్‌’ పుస్తకాలు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో కేవీఆర్‌ రచనలు చేశారని, తెలుగు సమాజపు చలనాన్ని, రాజకీయ సామాజిక ఉద్యమాలను విశ్లేషించారన్నారు. ప్రజల దైనందిన జీవితంలో అనేక వైరుధ్యాలకు ఆయన రచనలు ప్రతిబింబం అని కొనియాడారు. భారతీయ సామాజిక దొంతర్లలో కన్యాశుల్కం నాటకం ఒక గొప్ప సృజనాత్మకమైన కావ్యమన్నారు. మధురవాణి వంటి స్త్రీ పాత్రలను, పుత్తడి బొమ్మ వేదనను కేవీఆర్‌ భారతీయ స్త్రీల నుంచి విశ్లేషించారని తెలిపారు. అనేక ప్రపంచ పరిణామాలను తన రచనల ద్వారా తెలియజేశారని చెప్పారు. వీక్షణం సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌ ‘మతతత్వ వర్గ భావన కేవీఆర్‌’ అనే అంశంపై మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో భిన్న మతాల మధ్య విభజన తత్వం ఏర్పడిందన్నారు. కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య అశాంతికి బీజాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అనేక సాంస్కృతిక అంశాల మధ్య ఏకభావం లేదని, భిన్న మతాల సంస్కృతి, ఆహారపు అలవాట్లు ప్రశ్నార్థకం అవుతున్నాయని తెలిపారు. గురజాడ అప్పారావు మనవడు గురజాడ ప్రసాద్‌ ‘మహోదయం’ పుస్తకాన్ని ఆవిష్కరించగా... మనవరాలు ఇందిర ఆ పుస్తకంపై మాట్లాడారు. గురజాడ స్మారక భవనం అన్యాక్రాంతం కాకుండా పరిరక్షిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కేవీఆర్‌ శారదాంబ స్మారక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాటి శ్రీకృష్ణ, సి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌, చెంచయ్య, అశోక్‌కుమార్‌, వసుంధర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని