logo

‘బహుజనులకు రాజ్యాధికారం దక్కాలి’

బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని ఫూలే అంబేడ్కర్‌ రాజ్యాధికార సమితి(పార్స్‌) జాతీయ కన్వీనర్‌, ఫౌండర్‌ డా.కటికల శివభాగ్యారావ్‌, ఆ సమితి ఛైర్మన్‌, అడ్వైజర్‌ కమిటీ సభ్యుడు తట్టి అర్జునరావులు అన్నారు.

Published : 27 Mar 2023 04:47 IST

అభివాదం చేస్తున్న పార్స్‌ కమిటీ నాయకులు శివభాగ్యారావ్‌, అర్జునరావు తదితరులు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని ఫూలే అంబేడ్కర్‌ రాజ్యాధికార సమితి(పార్స్‌) జాతీయ కన్వీనర్‌, ఫౌండర్‌ డా.కటికల శివభాగ్యారావ్‌, ఆ సమితి ఛైర్మన్‌, అడ్వైజర్‌ కమిటీ సభ్యుడు తట్టి అర్జునరావులు అన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఫూలే అంబేడ్కర్‌ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో 100 కులాల ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దిల్లీ మొదటి ముఖ్యమంత్రి బ్రాహ్మణ ప్రకాష్‌, అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌లో ములాయం, మాయావతి, యూపీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు అద్భుతంగా పాలించారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నేటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం.. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. బీసీల్లో ఒక్క నాయకుడు కూడా ముఖ్యమంత్రి స్థాయికి అర్హుడు కాలేకపోయారా..? అని ప్రశ్నించారు.  స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయినా.. వాటి ఫలాలు బహుజనులకు అందలేదని చెప్పారు. 1950 నుంచి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌లు అమలవుతున్నా.. వారి జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకోలేదని తెలిపారు. కాన్షిరాం అన్నట్లుగా.. ఆవలించడానికి మాత్రమే నోరుతెరిచే నాయకులు.. బహుజనులుగా ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. బహుజన నాయకులకు ఓటు వేస్తే ఏ విధంగా లాభం పొందుతారో.. ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన గురుతర బాధ్యత మనదేనన్నారు. పార్స్‌ ఆధ్వర్యంలో రెండు నెలల్లో రాబోతున్న రాజకీయ పార్టీకి మన ఓటు వేసుకుందామని పిలుపునిచ్చారు. అల్ప సంఖ్యాకులు నేడు రాజ్యాధికారంలో ఉంటే.. అత్యధిక జనాభా ఉన్న బహుజనులు అధికారానికి దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి కులానికీ ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని అన్నారు. ఇదే పార్స్‌ అభిమతం అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో పార్స్‌ పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్స్‌ ఏపీ కమిటీ కోఆర్డినేటర్లు నమ్మి అప్పారావు యాదవ్‌, డా.పి.పరమ శివన్‌, కటికల రవికుమార్‌, సంధ్య, గురజాల శ్రీనివాసరావు, ఎం.డి.అబ్దుల్‌ ఖాన్‌, సత్యానందం, డా.కందుల చందు, నరేళ్ల కోటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని