logo

క్లస్టర్‌ వ్యవస్థతో కష్టాలు

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో కీలకమైన గ్రామ పంచాయతీలను సుదీర్ఘకాలంగా కార్యదర్శుల కొరత వేధిస్తోంది. అవసరం మేరకు నియమించలేని పాలకులు మూడు నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు.

Published : 27 Mar 2023 05:06 IST

గ్రామ పంచాయతీ కార్యదర్శులపై అదనపు భారం
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో కీలకమైన గ్రామ పంచాయతీలను సుదీర్ఘకాలంగా కార్యదర్శుల కొరత వేధిస్తోంది. అవసరం మేరకు నియమించలేని పాలకులు మూడు నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. మొత్తం క్లస్టర్ల అవసరాలకు అనుగుణంగా కార్యదర్శుల సంఖ్య చాలకపోవడంతో కొందరికి అదనపు బాధ్యత అప్పగించారు. ప్రజలకు సత్వర సేవలే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్న వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినా క్లస్టర్‌ కష్టాలు తీరలేదు.

గ్రేడ్‌- 5 వారికి అధికారాలేవీ

సచివాలయాల్లో వందల సంఖ్యలో నియమితులైన గ్రేడ్‌-5 కార్యదర్శులకు ఎటువంటి అధికారాలు అప్పగించకపోవడంతో వారు ఉన్నా లేనట్లుగా ఉంది.  ఈ నేపథ్యంలో గతేడాది పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు క్లస్టర్‌ వ్యవస్థ రద్దు కోసం చేసిన ప్రతిపాదనలతో పంచాయతీలకు మంచి రోజులొస్తాయని భావించినా తాజాగా సంబంధిత శాఖ మంత్రి సదరు ప్రతిపాదన తోసిపుచ్చడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ పంచాయతీల పరిపాలన విషయంలో కార్యదర్శులది కీలకపాత్ర. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఇళ్ల పన్నుల వసూలు, అభివృద్ధి పనుల వంటి విషయాల్లోనే కాకుండా ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అధికారం వారికే ఉంటుంది. అవసరం మేరకు కార్యదర్శుల లేకపోవడంతో క్లస్టర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్కో కార్యదర్శికి మూడు నుంచి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు.ఉమ్మడి జిల్లా పరిధిలోని 977 పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి, వాటికి  328 మంది గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-4 వరకూ ఉన్న కార్యదర్శులను నియమించారు. సగటున మూడు గ్రామాలకు ఒక్కరే కార్యదర్శిగా బాధ్యత నిర్వహించాల్సి ఉన్న పరిస్థితుల్లో వారు ఏ గ్రామంలోనూ పూర్థి స్థాయిలో అందుబాటులో లేకుండా పోతున్నారు. ఫలితంగా ప్రజలకూ అవస్థలు తప్పడంలేదు.

ఎదురుచూపులతోనే సరి

జిల్లాలో ఒక్కో క్లస్టర్‌కు మూడు నుంచి ఐదు పంచాయతీల చొప్పున 519 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టరుకు ఒక కార్యదర్శి చొప్పున నియమించాల్సి ఉన్నా అర్హులు 328 మందే ఉండటంతో వారికే అదనపు క్లస్టర్ల బాధ్యతలు అప్పగించారు. కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీల్లో పారిశుద్ధ్య అవసరాలు, ఇతరత్రా ప్రాధాన్యమైన ఖర్చుల నిమిత్తం పలువురు కార్యదర్శులు తమ వ్యక్తిగత పలుకుబడితో అప్పులు చేసి పాలన నెట్టుకొస్తున్నారు. పై అధికారులు, ప్రజల ఆగ్రహానికి గురికాకుండా పాలన సాగించడం, క్రమేపీ పంచాయతీల్లో నిర్వహణా వ్యయం పెరిగిపోతున్న దృష్ట్యా వారి నుంచి క్లస్టర్ల వ్యవస్థను రద్దుచేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో వ్యక్తమవుతోంది. సచివాలయాల్లోని గ్రేడ్‌-5 కార్యదర్శులు సైతం ఈ వ్యవస్థను రద్దు చేస్తే తమకు అధికారాలు బదలాయిస్తారన్న ఆశలు పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందన్న ఆశతో కార్యదర్శులు ఎదురుచూపుల్లో ఉన్నారు.

ఆశలు అడియాసలయ్యాయి..

క్లస్టర్ల వ్యవస్థను రద్దు చేస్తూ అన్ని పంచాయతీల్లో గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-5 వరకూ కార్యదర్శులను సర్దుబాటు చేయాలన్న పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిపాదనలు మూడు నెలల క్రితం ముఖ్యమంత్రికి సమర్పించారు. కమిషనర్‌ స్థాయిలో సానుకూలత ఉండటంతో సీఎం ఆమోదం లాంఛనమే అన్న ఆశతో జీవో కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల మంత్రి కార్యాలయం నుంచి ప్రతిపాదనలు వెనక్కు రావడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.  గ్రేడ్‌-5 కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ పోరాటం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని