logo

మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం

ఎన్టీఆర్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగే పరీక్షల కోసం విద్యార్థులను అన్ని రకాలుగా సిద్ధం చేసినట్టు వెల్లడించారు.

Published : 27 Mar 2023 05:06 IST

30,134 మంది విద్యార్థులు
పది పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు
డీఈవో సీవీ రేణుక
విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

ఎన్టీఆర్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగే పరీక్షల కోసం విద్యార్థులను అన్ని రకాలుగా సిద్ధం చేసినట్టు వెల్లడించారు. గతేడాది 66.54 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించినట్టు వెల్లడించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు తరచూ పరీక్షలు సైతం నిర్వహించామన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆమె ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఆమె మాటల్లోనే..

ఎన్టీఆర్‌ జిల్లాలోని 154 పరీక్షా కేంద్రాల్లో 30,134 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్‌ 27,329 మంది, ప్రైవేటుగా 2805మంది పరీక్ష రాస్తున్నారు. పరీక్షా కేంద్రాలను ఏబీసీ మూడు రకాలుగా విభజించాం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎ కేటగిరి 117, బి 21, సి 16 కేంద్రాలున్నాయి. చీఫ్‌ ఎగ్జామినర్లు 154, డిపార్ట్‌మెంట్‌ అధికారులు 154, కస్టోడియన్లు 25, ఇన్విజలేటర్లు 1430 మంది ఈ విధుల్లో పాల్గొంటారు.

సీసీ కెమెరాల ఏర్పాటు

గతంలో తలెత్తిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వాటిలో జగ్గయ్యపేట (బాలురు), జక్కంపూడి, తిరువూరు (బాలికలు), చందర్లపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలున్నాయి.

వసతుల సమస్య తలెత్తకుండా..

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని కేంద్రాల్లో బల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష రాసే విద్యార్థులంతా బల్లలపైనే కూర్చుని రాసేలా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్తు సౌకర్యం ఉండేలా చూస్తున్నాం. ప్రతి కేంద్రం వద్ద ఉచిత వైద్య శిబిరం ఉంటుంది. ఎలాంటి అత్యవసర వైద్య అవసరాలకైనా అక్కడికక్కడే సిబ్బంది ఉంటారు. పోలీసు పహారా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నింటి కోసం ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులతో ఇప్పటికే సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నాం.

అరగంట ముందే అనుమతి..

విద్యార్థులు వారికి కేటాయించిన కేంద్రాల వద్దకు ముందుగానే చేరుకోవాలి. పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందే కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతిస్తాం. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు చరవాణి,  ఎలక్ట్రానిక్‌ పరికరాలను కేంద్రానికి తీసుకురాకూడదు. పరీక్ష నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి కూడా ఇవే నిబంధనలు వర్తిసాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని