logo

ఆక్రమణలో దుర్గగుడి స్థలం

విజయవాడ దుర్గగుడికి చెందిన రూ.కోట్ల విలువైన ఆస్తులను అక్రమార్కులకు వదిలేసి భక్తులపై మాత్రం భరించలేనంత భారం మోపడంలో అధికారులు ఎప్పుడూ ముందుంటారు.

Updated : 28 Mar 2023 05:57 IST

విలువైన ఆస్తుల పరిరక్షణలో అధికారుల విఫలం

టిక్కెట్‌ ధరలు పెంచడంలో మాత్రం అత్యుత్సాహం

ఆలయానికి రావాల్సిన అద్దెలు అక్రమార్కుల జేబుల్లోకి
ఈనాడు, అమరావతి, ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే

ఆలయం కోసం రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలంలో అక్రమంగా వెలిసిన దుకాణాలు

విజయవాడ దుర్గగుడికి చెందిన రూ.కోట్ల విలువైన ఆస్తులను అక్రమార్కులకు వదిలేసి భక్తులపై మాత్రం భరించలేనంత భారం మోపడంలో అధికారులు ఎప్పుడూ ముందుంటారు. ఆలయ సమగ్రాభివృద్ధి చేపడతామంటూ కొన్నాళ్ల క్రితం ఇంద్రకీలాద్రి దిగువన అర్జునవీధి ఆరంభంలో స్థలాన్ని రూ.5 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. గతంలో అక్కడ ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు, ఓ ప్రైవేటు హోటల్‌ ఉండేవి. వాటిని తొలగించి పరిహారం చెల్లించి ఆలయం కోసం తీసుకున్నారు. కొండపై ఎలాంటి కార్యాలయాలు ఉండకుండా కిందనే ఈ స్థలంలో కట్టాలని అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. దీని కోసం కొండపై ఉన్న కార్యాలయాలను అడ్డంగా కొట్టేశారు. అన్నదాన భవనాన్ని కూడా తొలగించేశారు. కానీ ప్రస్తుతం కొండ దిగువన ఉన్న ఆ స్థలం అక్రమార్కుల పాలైంది. ఎవరెవరో వచ్చి దుకాణాలు పెట్టుకున్నారు. ఈ దుకాణదారులు ఆలయానికి ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించడం లేదు. స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు వీరికి ఉండడంతో ఆలయ అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా చోటామోటా నాయకులు వీరి నుంచి భారీగా మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు. కనీసం ఆ స్థలంలో ఉన్న దుకాణాల నుంచి అద్దెలు వసూలు చేయాలనే స్పృహ కూడా అధికారులకు లేదు. ఎంతసేపూ భక్తుల టిక్కెట్లు, ప్రసాదాల ధరలు పెంచుకుంటూ వారిని ఇబ్బందులకు గురిచేయడంపైనే అధికారుల దృష్టంతా ఉంటుంది.

ఇదే స్థలంలో రూ.50లక్షలతో షెడ్డు కూడా..

కొండ దిగువన ఉన్న ఈ స్థలంలో రూ.50 లక్షలతో ఈవో సూర్యకుమారి హయాంలో ఓ భారీ షెడ్డు కూడా గతంలో వేశారు. ఇక్కడ కొద్దికాలం అన్నదానం ఏర్పాటు చేశారు. ఇక్కడే అన్నదానం కోసం ఓ భవనం కట్టాలని అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. ఈవో మారగానే అన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ షెడ్డు కూడా నిరుపయోగంగా పడి ఉంది. కనీసం రూ.కోట్ల విలువైన ఆ స్థలం పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ప్రస్తుతం మహామండపంలో అన్నదానం పెడుతుండడంతో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. ఇవేవీ అధికారులకు పట్టడం లేదు.

రూ.500 టిక్కెట్‌పై తీవ్ర విమర్శలు..

రూ.కోట్ల విలువైన స్థలాలు, ఆస్తులను పరిరక్షించి.. వాటి ద్వారా ఆలయానికి ఆదాయాన్ని వచ్చేలా చేయడంపై అధికారులు దృష్టిపెడితే బాగుంటుంది. కానీ వాటిని అక్రమార్కులకు వదిలేసి ఎప్పుడు చూసినా టిక్కెట్‌ ధరలు పెంచుకుంటూ పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత దసరాలో వీఐపీ భక్తుల కోసమంటూ రూ.500 టిక్కెట్‌ ధరను పెట్టారు. కానీ దసరా తర్వాత అదే టిక్కెట్‌ ధరను కొనసాగిస్తున్నామని.. సాధారణ భక్తులూ అంతరాలయ దర్శనం కావాలంటే కొని తీరాల్సిందేనని ప్రస్తుత ఈవో ప్రకటించారు. భక్తులకు సకల సౌకర్యాలు ఉన్న తిరుపతిలోనే రూ.300 టిక్కెట్‌ ధర ఉంటే.. ఇక్కడ మాత్రం రూ.500 ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. అంతరాలయ దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేయలేక అసంతృప్తితో తిరిగి వెళ్తున్నారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబం వస్తే రూ.2500 ధర పెట్టి అంతరాలయ దర్శనం చేసుకోవడం తీవ్ర భారంగా మారింది. ఒకేసారి ఒక్కో టిక్కెట్‌పై ఇంత భారీగా రూ.200 చొప్పున ధర పెంచడం అంటే భక్తులపై ఆర్థికంగా తీవ్ర భారం మోపడమే. కానీ అధికారులు కనీస ఆలోచన కూడా లేకుండా భారీగా పెంచేశారు. కనీసం ఇప్పటికైనా దీనిపై పాలక మండలి, అధికారులు పునరాలోచించి ధర తగ్గిస్తే భక్తులకు భారం తగ్గుతుంది. అంతరాలయ టిక్కెట్‌ ధర తగ్గించినా ఆలయానికి ఆదాయం మాత్రం తగ్గదు. అంతరాలయ దర్శనం లేనప్పుడు రూ.300, రూ.100కు పెద్దగా తేడాలేదని భక్తులు భావిస్తున్నారు. అందుకే రూ.100 దర్శనాలకే వెళ్లిపోతున్నారు. అంతరాలయం ధర గతంలో మాదిరిగా రూ.300 చేస్తే.. ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని