logo

బాలిక బలవన్మరణం

ఇంట్లో పని చేస్తున్న ఓ బాలిక(11)ను యజమాని మందలించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.  

Published : 28 Mar 2023 04:45 IST

ఇంటి యజమాని మందలించడమే కారణమంటూ తల్లి ఫిర్యాదు

పెనమలూరు, న్యూస్‌టుడే: ఇంట్లో పని చేస్తున్న ఓ బాలిక(11)ను యజమాని మందలించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.  శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన బాలిక తండ్రి కొంతకాలం క్రితం ఓ ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబ పోషణకు తల్లి.. కుమార్తెను తన గ్రామానికి చెందిన రాము ద్వారా పోరంకిలోని నిడమానూరు రహదారిలో నివసించే కాకర్ల రామకృష్ణ ఇంట్లో పని మనిషిగా చేర్చింది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం బాలిక తనను పనిలో చేర్పించిన రాముకు ఫోన్‌ చేసింది. యజమాని రామకృష్ణ ఇంట్లో నగదు కనిపించడం లేదని, తానే దొంగతనం చేసినట్లు మందలించడంతో పాటు దొంగతనం చేసి బతికే బదులు చచ్చిపో అంటూ తిట్టాడంటూ రాముకు చెప్పుకొని మథ]నపడింది. ఈ విషయాన్ని రాము వెంటనే ఆమె తల్లికి తెలిపాడు. అదే రోజు రాత్రి యజమాని రామకృష్ణ.. రాముకు ఫోన్‌ చేసి బాలికకు అనారోగ్యంగా ఉందని, తల్లిని వెంటనే పోరంకికి పంపాల్సిందిగా సూచించాడు. ఆందోళనకు గురైన బాలిక తల్లి తన బంధువులతో కలిసి సోమవారం ఉదయం పోరంకికి చేరుకుంది. అప్పటికే కుమార్తె మృతి చెంది ఉండటాన్ని గుర్తించి యజమానిని ప్రశ్నించగా.. ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. యజమాని రామకృష్ణ మందలించడం వల్లే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు రామకృష్ణపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని