logo

విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా ధర్నాలు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో చేపట్టిన నిరసన దీక్షలు ఏప్రిల్‌ 1వ తేదీకి 700వ రోజుకు చేరుతాయి.

Published : 30 Mar 2023 02:16 IST

ప్రసంగిస్తున్న రావులపల్లి రవీంద్రనాథ్‌

విజయవాడ(అలంకార్‌కూడలి): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో చేపట్టిన నిరసన దీక్షలు ఏప్రిల్‌ 1వ తేదీకి 700వ రోజుకు చేరుతాయి. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక కన్వీనర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. తమ పోరాటంతో కర్మాగారం అమ్మకం విషయంలో కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డుకోగలిగినట్లు తెలిపారు.  వైకాపా ఎంపీలు లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. రానున్న రోజుల్లో జగన్‌ను గద్దె దింపుతామని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌లకు ఈ సంవత్సరం లాభాలు వచ్చాయని, ఒక్క విశాఖకు నష్టాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. విశాఖ ఉక్కును బలహీనపర్చటానికి కుట్ర చేస్తోందన్నారు. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరో కన్వీనర్‌, సీఐటీయూ రాష్ట్ర కమిటీ నాయకుడు యు.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రూ.ఐదు వేల కోట్లు పెట్టుబడితో డివిడెండ్లు ఇచ్చిన విశాఖ ఉక్కును అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి కె.పోలారి,  రాష్ట్ర కమిటీ నేత జే.కిషోర్‌బాబు, ఉపాధ్యక్షుడు ఎం.రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ నేతలు కె.సుధీర్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆదిబాబు తదితర నాయకులు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని