logo

‘మోదీ వైఫల్యాలు ఎత్తి చూపుతాం’

మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తామని మాజీ ఎంపీ, ప్రొఫెసర్‌ రాజీవ్‌గౌడ పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 02:16 IST

రాజీవ్‌గౌడకు జ్ఞాపిక అందిస్తున్న గిడుగు రుద్రరాజు. చిత్రంలో

పద్మశ్రీ, నరసింహారావు, గురునాథం తదితరులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తామని మాజీ ఎంపీ, ప్రొఫెసర్‌ రాజీవ్‌గౌడ పేర్కొన్నారు. మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 8 వరకు దేశ వ్యాప్తంగా ‘జై భారత్‌ సత్యాగ్రహ’ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన ఆంధ్రరత్న భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అదానీ ఆర్థిక అవకతవకలపై జాయింట్‌ పార్లమెంటరీ ఎందుకు నియమించటం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే రాహుల్‌ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  పార్లమెంట్‌ వేదికపై రాహుల్‌ మాట్లాడిన ప్రతి అంశానికి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు.  హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. రక్షణ రంగంలోకి ప్రైవేటు సంస్థలను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఈడీని ప్రయోగించి.. ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తోందన్నారు. అదానీ విషయంలో సెబీ ఇచ్చిన ఆధారాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. వెలుగులోకి వస్తున్న స్కాముల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని దుయ్యపట్టారు. కక్ష సాధింపు రాజకీయాలను పోరాటాల ద్వారా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. రాహుల్‌ అనర్హతపై హైకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ దీనిపై పని చేస్తోందని, త్వరలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని పేర్కొన్నారు. భాజపా ఓటమి ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు.  అనంతరం ఆయన్ని నాయకులు సన్మానించారు. ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ వి.గురునాథం, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని