logo

బ్యాంకు లావాదేవీల్లో కేడీసీసీకి గుర్తింపు : ఛైర్మన్‌

దేశంలో అయిదో అతి పెద్ద డీసీసీబీగా కేడీసీసీ గుర్తింపు పొందిందని ఆ బ్యాంకు ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు వెల్లడించారు.

Published : 30 Mar 2023 02:16 IST

ప్రసంగిస్తున్న తన్నీరు నాగేశ్వరరావు. చిత్రంలో డైరెక్టర్లు తదితరులు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : దేశంలో అయిదో అతి పెద్ద డీసీసీబీగా కేడీసీసీ గుర్తింపు పొందిందని ఆ బ్యాంకు ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు వెల్లడించారు. 42 శాతం వ్యాపారాభివృద్ధితో రూ.10150 కోట్ల వ్యాపారం దాటిందన్నారు. బుధవారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంకు 108వ మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుర్తింపుకు కారణం సహకార సంఘాలు అని, రైతుల అభ్యున్నతికి తీసుకున్న కీలక నిర్ణయాలే అని చెప్పారు. ఇందులో భాగంగా నష్టాల్లో ఉన్న 41 సహకార సంఘాలకు రూ.6.66కోట్లు వడ్డీ రాయితీ ప్రకటించామని తెలిపారు. 172 సంఘాలకు నూతన భవనాలు, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.42 కోట్ల రుణాలు, రూ.2.38 కోట్ల గ్రాంట్‌లు మంజూరు చేసినట్టు వివరించారు. సంఘంలోని రైతు మరణిస్తే బీమా, రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న రైతు మరణిస్తే వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు. గత 20 నెలల్లో ఓటీఎస్‌ ద్వారా రూ.3.99 కోట్ల వడ్డీ మాఫీ చేశామని, డ్వాక్రా మహిళలకు రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్నట్లు చెప్పారు. అద్దె భవనాల్లోని బ్యాంకులకు సొంతంగా స్థలాలు కొనుగోలు చేసి, భవనాల నిర్మాణాలు, ఇతర శాఖల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు రూ.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వంద శాతం రుణాలు వసూలు చేసిన ఆరు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ డైరెక్టర్లు పడమట సుజాత, భూక్యారాణి, ఎన్‌.కె.ఎస్‌.ప్రకాష్‌రావు, కొమ్మినేని రవిశంకర్‌, గుడిదేశి పెద వెంకయ్య, గుమ్మడపు రవీంద్రరాణి, సీఈవో శ్యామ్‌మనోహర్‌, జీఎం చంద్రశేఖర్‌, రంగబాబు, ఆప్కాబ్‌ జీఎం పి.ఎస్‌.మణి, సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని