logo

పది పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు

జిల్లాలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 30 Mar 2023 02:12 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మొత్తం 30,134 మంది విద్యార్థులు హాజరు కానుండగా, వీరిలో బాలురు 15,530 మంది, బాలికలు 14,604 మంది ఉన్నట్టు వెల్లడించారు. 27,329 మంది రెగ్యులర్‌, 2,805 మంది సప్లమెంటరీ విద్యార్థులు ఉన్నట్టు వివరించారు. వీరి కోసం 154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నగరంలోని విడిది కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో 1,354 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. ఇద్దరు అదనపు డిపార్టుమెంట్‌ అధికారులతో పాటు, ‘సి’ కేటగిరి కేంద్రాలకు 14 మంది రూట్‌ అధికారులు, అదనంగా మరో 12 మంది రూట్‌ అధికారులను ‘ఎ’, ‘బి’ కేంద్రాలకు నియమించినట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, సమీపంలో జిరాక్సు సెంటర్లను మూసివేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు కోసం 12 వాహనాలను సిద్ధం చేసినట్టు తెలిపారు. విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసులు, కేంద్రాల్లో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పారు. తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేంద్రాల్లోకి చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.

19 నుంచి స్పాట్ వాల్యూయేషన్‌

పరీక్షలు ముగిసిన అనంతరం నగరంలోని బిషప్‌ అజరయ్య పాఠశాలలో ఏప్రిల్‌ 19 నుంచి 26వ తేదీ వరకు స్పాట్‌ వాల్యూయేషన్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో 24 గంటల పాటు పోలీస్‌ ఆర్మ్‌డ్‌ గార్డులతో పహారా ఉంటుందన్నారు. డీఈవో సి.వి.రేణుక పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని