logo

‘పరిహారం ఇవ్వకపోతే పొలాలు వెనక్కి ఇచ్చేయండి’

‘ఏడేళ్లుగా పోరాటం చేస్తున్నా పరిహారం విషయం ఎటూ తేల్చడం లేదు.. ఇస్తే తక్షణం చెల్లించండి.. లేకుంటే మా భూములు వెనక్కు ఇచ్చేయండంటూ’ మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడ నిర్వాసితులు డిమాండ్‌ చేశారు.

Published : 30 Mar 2023 03:09 IST

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నమల్లవల్లి నిర్వాసితులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ‘ఏడేళ్లుగా పోరాటం చేస్తున్నా పరిహారం విషయం ఎటూ తేల్చడం లేదు.. ఇస్తే తక్షణం చెల్లించండి.. లేకుంటే మా భూములు వెనక్కు ఇచ్చేయండంటూ’ మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడ నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. పరిహారం కోసం నెల రోజులుగా వీరు చేపట్టిన ఆందోళనలో భాగంగా బుధవారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని మరోసారి ముట్టడించారు. కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పదే పదే సమావేశాలు, చర్చలంటూ అధికారులు కాలయాపన చేయడంపై మండిపడ్డారు. పరిహారం విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదంటూ నిర్వాసితుల సంఘం నాయకుడు పంతం కామరాజు, చిన్నాల ప్రసాద్‌ ఆధ్వర్యంలో భీష్మించారు. నెల రోజుల నుంచి పారిశ్రామిక వాడలోనే శిబిరం ఏర్పాటు చేసుకుని, అక్కడే వంటావార్పు నిర్వహిస్తున్నామని, రైతులంతా పనులు మానుకుని మరీ ఉద్యమం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై వాసా వెంకటేశ్వరరావు నిర్వాసిత నాయకులతో చర్చలు జరిపారు. తహసీల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం సమావేశమవుదామని తహసీల్దార్‌ చెప్పడంతో మొదట నిరాకరించిన ఆందోళనకారులు, ఎస్సై నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. పారిశ్రామికవాడలో మాత్రం శిబిరం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని