logo

సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత

సనాతన ధర్మపరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని ప్రణవాశ్రమానికి చెందిన స్వామీజీ స్థైర్యానంద సరస్వతి అన్నారు.

Published : 31 Mar 2023 05:03 IST

ప్రసంగిస్తున్న స్వామీజీ

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: సనాతన ధర్మపరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని ప్రణవాశ్రమానికి చెందిన స్వామీజీ స్థైర్యానంద సరస్వతి అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా గురువారం హిందూ చైతన్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ ప్రసంగిస్తూ ధర్మరక్షణే లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక ప్రాంతమైన మచిలీపట్నంలో జరిగిన యాత్రకు వేలాదిగా భక్తులు తరలిరావడం అభినందనీయమన్నారు. ఏటా యాత్ర నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. హిందువులు అంతా ఐక్యంగా ఉంటూ అయోధ్యలో రామమందిర నిర్మాణ పూర్తయ్యేవరకు ఇదే స్ఫూర్తితో కృషి చేయాలని సూచించారు. హిందూ కళాశాల నుంచి ప్రారంభమైన యాత్ర లక్ష్మీటాకీసు కూడలివరకు సాగింది. చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా అందరూ  పాల్గొని జెండాలు చేతబూని నినాదాలు చేశారు. పలువురు మహిళలు శ్రీరామ నామస్మరణ చేస్తూ నృత్యం చేశారు. కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఆలయ పాలకవర్గ ప్రతినిధి మోటమర్రి బాబాప్రసాద్‌తో పాటు వాసవీ కో-ఆపరేటివ్‌ సొసైటీ సభ్యులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ముస్లింలు ర్యాలీలో పాల్గొన్న వారికి మజ్జిగ పంపిణీ చేసి మతసామరస్యతను చాటిచెప్పారు.  వాహనంపై దేవతామూర్తులను ఊరేగిస్తూ పురవీధుల్లో సాగిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రతోపాటు వైకాపా, భాజపా, జనసేన వివిధ పక్షాల నాయకులు కూడా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని