logo

పన్నుల సొమ్మూ విద్యుత్తు బకాయిలకేనా?

జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.78 కోట్ల వరకూ ఉండగా ఇప్పటికే 63 శాతానికి పైగా వసూలు చేశారు.

Published : 31 Mar 2023 05:19 IST

జిల్లా పంచాయతీ కార్యాలయం

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.78 కోట్ల వరకూ ఉండగా ఇప్పటికే 63 శాతానికి పైగా వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకరోజులో ముగుస్తుండగా మిగిలిన రూ.27 కోట్ల వసూళ్లపై దృష్టి సారించారు.అయితే తాము ఇంత కష్టపడి పన్నులు వసూలు చేసినా తమకు ఒరిగేదేమీ ఉండదని , పన్నుల రూపంలో వచ్చిన మొత్తాన్ని విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేస్తారేమోనన్న భయం సర్పంచులను వెంటాడుతోంది.

జిల్లాలోని 497 పంచాయతీలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్ల లక్ష్యం 78.05 కోట్లుగా ఉంది. ఇందులో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.25.59 కోట్లు. పంచాయతీలకు స్థానికంగా సమకూరే ఆదాయంలో ఇంటి పన్నులే కీలకం. గతంలో ఈ ఆదాయంతోనే పరిపాలనా పరమైన అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చింది. కేంద్ర ఆర్థిక సంఘ నిధులు నేరుగా పంచాయతీలకు జమ చేస్తున్నప్పటి నుంచి అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో పంచాయతీలకు ఆర్థిక పరిపుష్ఠి లభించింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బకాయిల రూపంలో దారి మళ్లిస్తుండటంతో ఎప్పటికప్పుడు ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. అత్యధిక శాతం పంచాయతీల్లో గడచిన నాలుగేళ్లగా అభివృద్ధి పనుల ఊసే లేకపోగా కొన్ని పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికులకు సైతం జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కనీసం ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా కనీసం ఒకట్రెండు పనులైనా చేసి తమ పరువు నిలుపుకోవాలనే ఆలోచన పలువురు సర్పంచుల్లో వ్యక్తమవుతోంది.

సర్పంచుల ఆవేదన

గత ఏడాదితో పోలిస్తే పన్ను వసూళ్ల పరిస్థితి మెరుగ్గా ఉన్నా సర్పంచుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామస్థులను ఒత్తిడి చేసి పన్నులు కట్టించినా పంచాయతీలకు ఒరిగేది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే జిల్లా పంచాయతీ అధికారులు పంచాయతీ సాధారణ నిధుల నుంచి విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అన్ని పంచాయతీల మీద ఇంకా రూ.150 కోట్లకు పైగా బకాయిలున్న దృష్ట్యా వాటి చెల్లింపులపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. దీంతో మొత్తం వసూలైన పన్నుల మొత్తాన్ని కూడా విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేస్తారన్న భయం వారిని వెంటాడుతోంది.


లక్ష్యాలు నిర్దేశించి..

ఇంటి పన్నుల వసూలు విషయంలో జిల్లా ఉన్నతాధికారులు గడచిన మూడు నెలలుగా కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. నెల వారీ లక్ష్యాలు నిర్దేశించి సమీక్షల ద్వారా కార్యదర్శులను పరుగులు పెట్టించారు. ఇంటి పన్ను, గ్రంథాలయ పన్నుకు సంబంధించిన డిమాండ్‌ రూ.52.77 కోట్లలో 66.64 శాతం, చేపల చెరువులు, దుకాణ లైసెన్స్‌లు, కుళాయిలు తదితర నాన్‌ట్యాక్స్‌ డిమాండ్‌ రూ.25.28 కోట్లలో 61.24 శాతం వసూలు చేశారు. జిల్లా మొత్తం మీద ఇప్పటికి రమారమి 150కు పైగా పంచాయతీల్లో నూరు శాతం లక్ష్యం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని