logo

రమ్మంటారు.. వస్తే ఉండరు!

జిల్లా ఆసుపత్రి సర్వజన ఆసుపత్రిగా వర్గోన్నతి చెందడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని అందరు భావిస్తుంటే ఉన్నవి కూడా సక్రమంగా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 31 Mar 2023 05:19 IST

మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో ఆగిన సదరం సేవలు
ఇబ్బందులు పడుతున్న రోగులు

ఆసుపత్రిలోని వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రం

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జిల్లా ఆసుపత్రి సర్వజన ఆసుపత్రిగా వర్గోన్నతి చెందడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని అందరు భావిస్తుంటే ఉన్నవి కూడా సక్రమంగా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిని అభివృద్ధి చేసే క్రమంలో పలు సేవలు నిలిపివేశారు. వాటిలో ఒక్కొక్కటిగా పునరుద్ధరించినా ఇంకా సదరం సేవలు ప్రారంభించలేదు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారికి మాత్రం యథావిధిగా తేదీలు కేటాయించడంతో దూర ప్రాంతాలనుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రెండు నెలలుగా నిలిచిన సేవలు

ఆసుపత్రిలో మానసిక, ఆర్ధో, కంటి, చెవి విభాగాలకు సంబంధించి సదరం సేవలు అందుబాటులో ఉన్నాయి. వారంలో మంగళవారం, శుక్రవారం రెండు రోజులపాటు శిబిరం జరుగుతుంది. సర్వజన ఆసుపత్రిగా వర్గోన్నతి కల్పించడంతో అంతకు ముందు వైద్యవిధానపరిషత్‌ పరిధిలో విధులు నిర్వహించిన వివిధ విభాగాల వైద్యులు అందరినీ ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అప్పటినుంచి సేవలు నిలిచిపోయాయి. వారి స్థానంలో  కొత్త వైద్యులను నియమించడంతో వైద్యపరమైన సేవలు అందిస్తున్నా సదరం శిబిరం ప్రారంభం కాలేదు. కొత్తగా నియమితులైన వైద్యులకు డిజిటల్‌ టోకెన్ల పంపిణీ పూర్తికాకపోవడంతోనే ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే వారు పరీక్షలు నిర్వహించి వైకల్య ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉన్నతాధికారులకు తెలిసినా ఇంతవరకు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. టోకెన్లు కేటాయించే క్రమంలో ఒక్కో వైద్యుడు రూ.1300ల నగదు చెల్లించాల్సి  ఉంటుంది. ఈ మొత్తాన్ని తరువాత ప్రభుత్వపరంగా వైద్యులకు తిరిగి ఇస్తారు. దీనిని చెల్లించడానికి కూడా కొందరు వైద్యులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

రోగుల ఇక్కట్లు

సేవలు నిలిచినా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి ఫలానా తేదీల్లో మచిలీపట్నం ఆసుపత్రికి వెళ్లాలన్నా సందేశాలు వస్తున్నాయి. దీంతో  ఆయా విభాగాలకు చెందిన వారు తమకు నిర్దేశించిన రోజుల్లో ఆసుపత్రికి వచ్చి ఉసూరు మంటూ వెనుదిరిగి వెళుతున్నారు. శిబిరానికి వచ్చే వారందరూ వివిధ వైకల్యాలకు సంబంధించినవారే. వారిని ఆసుపత్రికి తీసుకురావాలంటే కుటుంబ సభ్యులు కూడా తోడు రావాలి. ఇలా అనేకమంది వాహనాలను బాడుగకు తీసుకుని వచ్చి సేవలు నిలిచిపోయాయని తెలుసుకుని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని ముందుగానే సమాచారం ఇస్తే  ఇక్కడవరకు రావాల్సిన అవసరం ఉండదుకదా అని ప్రశ్నిస్తున్నారు. గడచిన మంగళవారం కూడా పామర్రుతోపాటు వివిధ ప్రాంతాలనుంచి అనేకమంది ఆసుపత్రికి వచ్చి వెనుదిరిగి వెళ్లారు.  కొన్ని వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో కూడా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని వాపోతున్నారు. మళ్లీ ఎప్పుడు రావాలో... ఇంకెన్ని నెలలకు పరీక్షలు నిర్వహిస్తారో... ధ్రువపత్రాలు ఎప్పటికి వస్తాయో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వచ్చి తిరిగివెళ్తున్నా
- గోవిందరాజులు, కారకంపాడు, మొవ్వ మండలం

గతంలో నాకు ధ్రువపత్రం జారీ చేశారు. అందులో తప్పులు ఉన్నాయని, సరిచేసుకురావాలని చెబితే ఇక్కడి వచ్చాను. అందుబాటులో ఎవరూ లేరు తరువాత రావాలని చెప్పారు. ఎప్పుడు రావాలో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. నాలాగా పరీక్షల కోసమని వచ్చి వెళ్లిపోయారు. అధికారులు చొరవ తీసుకుని సాధ్యమైనంత త్వరగా సేవలు ప్రారంభించాలని కోరుతున్నాం.


త్వరలోనే ప్రారంభిస్తాం
- రామచంద్రరావు, ఆర్‌ఎంవో, సర్వజన ఆసుపత్రి

అందరూ కొత్త వైద్యులు కావడంతో డిజిటల్‌ టోకెన్స్‌ జారీలో కొంత ఆలస్యమైంది. ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాం. సాధ్యమైనంతవరకు వచ్చేవారంలోనే సదరం సేవలు తిరిగి ప్రారంభిస్తాం. రోగులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ధ్రువపత్రాలను కూడా వేగవంతంగా జారీ చేసేందుకు కార్యాచరణ చేపట్టాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని