logo

పఠనాసక్తితో విజ్ఞానాభివృద్ధి

పఠానాసక్తితో ప్రతి ఒక్కరిలోనూ విజ్ఞానం పెరుగుతుందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ పఠానాసక్తికి ఆదరణ ఉందన్నారు.

Published : 31 Mar 2023 05:19 IST

వేమూరి బలరామ్‌ను సత్కరిస్తున్న కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ సాంస్కృతికం, గాంధీనగర్‌, న్యూస్‌టుడే : పఠానాసక్తితో ప్రతి ఒక్కరిలోనూ విజ్ఞానం పెరుగుతుందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ పఠానాసక్తికి ఆదరణ ఉందన్నారు. జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ జైనీ సాహిత్య పురస్కారాన్ని.. స్వాతి చినుకులు గ్రంథానికి ప్రకటించారు. ఆ గ్రంథ రచయిత, ‘స్వాతి’ సంపాదకుడు వేమూరి బలరామ్‌కు డిల్లీరావు చేతుల మీదుగా పురస్కారం, రూ.లక్ష నగదు అందజేశారు. గురువారం గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బలరామ్‌ జీవిత గాధ ఆధారంగా జైనీ ఫౌండేషన్‌ నిర్వాహకుడు ప్రభాకర్‌ జైనీ దర్శకత్వంలో రూపొందించనున్న ‘అతడే ఒక సైన్యం’ బయోపిక్‌ చిత్ర షూటింగ్‌ను క్లాప్‌ కొట్టి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ స్వాతి పత్రిక పాఠకుల అభిమానాన్ని చూరగొంటోందంటే.. అందులో సమకాలీన అంశాలు ఉండటమేనని చెప్పారు. పురస్కార గ్రహీత మాట్లాడుతూ... తనకు ఇచ్చిన రూ.లక్ష నగదును జిల్లాలో విద్యార్థి వసతి గృహాల అభివృద్ధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి, ఆ నగదును కలెక్టర్‌కు అందజేశారు. ప్రభాకర్‌ జైనీ కూడా మాట్లాడారు. మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ మారం రామకృష్ణ, చైతన్య జైనీ, బయోపిక్‌ చిత్ర నిర్మాత విజయలక్ష్మి జైనీ, కవి బిక్కి కృష్ణ, కథా రచయిత చంద్రశేఖర్‌ ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని