logo

మెరక పేరుతో... నిధుల మేత..!

మైలవరం నియోజకవర్గ పరిధిలో ఒక లేఔట్‌ మెరక పనులకు రూ.15 కోట్లు ప్రతిపాదించాలని ఓ మంత్రి సిఫార్సు. దీనికి మెరకతో పాటు అంతర్గత రహదారులు, కల్వర్టులు ఇతరత్రా పనులకు ప్రతిపాదనలు చేసినా రూ.6.5కోట్లు దాటలేదు.

Published : 31 Mar 2023 05:31 IST

పనులు చేయకుండానే బిల్లులు
జగనన్న లేఔట్లలో నిధుల దుర్వినియోగం
ఈనాడు, అమరావతి

కొండపల్లి జగనన్న కాలనీ

మైలవరం నియోజకవర్గ పరిధిలో ఒక లేఔట్‌ మెరక పనులకు రూ.15 కోట్లు ప్రతిపాదించాలని ఓ మంత్రి సిఫార్సు. దీనికి మెరకతో పాటు అంతర్గత రహదారులు, కల్వర్టులు ఇతరత్రా పనులకు ప్రతిపాదనలు చేసినా రూ.6.5కోట్లు దాటలేదు. ఏం నేను చెప్పిన మాట వినవా..? అంటూ ఎన్టీఆర్‌ జిల్లా అధికారిపై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం కొత్త అధికారితో ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. జగనన్న లేఔట్ల పేరుతో నిధుల దుర్వినియోగానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఉమ్మడి జిల్లాలో ఇంతవరకు ఒక్క గృహ ప్రవేశం కాలేదు. ఒక్క జగనన్న కాలనీలోనూ మౌలిక వసతులు లేవు. కానీ మెరక పేరుతో రూ.కోట్లు ఖర్చయ్యాయి. అంతర్గత రహదారులు, కల్వర్టుల పేరుతో నిధులు మేసేశారు. తమకు అనుకూల అధికారులను నియమించుకుని ఇష్టానుసారంగా బిల్లులు చేశారు. అసలు పనులు చేయకుండానే నిధులు ఆవిరయ్యాయి. ఉగాది నాటికి ఉమ్మడి జిల్లాలో దాదాపు 22వేల కుటుంబాలతో సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నెరవేరక చేతులెత్తేశారు. ఇప్పటికే కొంత మంది లబ్ధిదారులు గృహాలను పూర్తి చేసుకుని మౌలిక వసతులు లేక ఇంటికి తాళాలు వేసుకున్నారు. నిర్మాణం పూర్తయినా ఉండలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. కొన్ని లేఔట్‌లలో ఒక్క గృహాన్ని ప్రారంభించలేదు. మరోవైపు సివిల్‌ పనుల పేరుతో నిధులను మేస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో 82,823 గృహాలకు కేవలం 7,258 పూర్తయ్యాయి. మార్చి నాటికి ఇవి 9వేలకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఏప్రిల్‌లో సామూహిక గృహప్రవేశాలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు ఇంకా మెరక పేరుతో నిధులు కుమ్మరిస్తున్నారు. లేఔట్లు మాత్రం మెరక కావడం లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులు కరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు కేవలం మెరక పనుల కోసం ఖర్చు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో దాదాపు నాలుగైదు కొండలు కరిగిపోయాయి.  

* కృష్ణా జిల్లాలో ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్‌ను ప్రధాన కార్యాలయానికి పంపారు. డిప్యుటేషన్‌పై ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన వేతనం మాత్రం కృష్ణా జిల్లా పీడీగా తీసుకుంటున్నారు. ఆయన స్థానంలో డ్వామా పీడీ సూర్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

* ఎన్టీఆర్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ను పదవీ విరమణ మూడు నెలల ముందు బదిలీ చేశారు. ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆమె స్థానంలో అనంతపురంలో పీడీగా నియమించిన రజినీకుమారిని నియమించారు. ఆమె అనంతపురంలో వేతనం పొందుతూ ఇక్కడ డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇంత మతలబు ఎందుకనేదే అర్థం కాని ప్రశ్న.

* ఎన్టీఆర్‌ జిల్లాకు కృష్ణా జిల్లా డ్వామా పీడీ సూర్యనారాయణ నిధులు మంజూరు చేయాల్సి ఉంది. దీంతో ఆయనను హౌసింగ్‌ ఇన్‌ఛార్జి పీడీగా నియమించినట్లు చెబుతున్నారు.  

* ఎన్టీఆర్‌ జిల్లాలో 80 లేఔట్లు చదునుకు రూ.50 కోట్లు ఉపాధి నిధులు ఖర్చయ్యాయి. కేవలం మెరక పనులకే వెచ్చించినట్లు నమోదు చేశారు. కానీ వణుకూరులో పొలాల్లోనే లేఔట్లు ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేఔట్ల మెరక పనులు చేయలేదు. కానీ గ్రావెల్‌ తరలిపోయింది.

* ఎన్టీఆర్‌ జిల్లాలో అప్రోచ్‌ రోడ్లు, లేఔట్‌ రోడ్లు కలిపి మొత్తం రూ.588.60 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 162 పనులు జరుగుతున్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రూ.5 లక్షల చొప్పున విడగొట్టి నేతలకు పనులను అప్పజెప్పారు. నామమాత్రంగా పనులు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని