మట్టి మాఫియా బరి తెగింపు
మట్టి మాఫియా బరి తెగించారు. పట్టపగలే టిప్పర్లు, పొక్లెయిన్లు తెచ్చుకొని చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.
చెరువు నుంచి అక్రమ తరలింపు
తెలిసినా నోరు మెదపని అధికారులు
దుర్గాదేవి చెరువులో గ్రావెల్‌ను టిప్పర్‌లో లోడు చేస్తున్న పొక్లెయిన్
వినగడప (గంపలగూడెం), న్యూస్‌టుడే: మట్టి మాఫియా బరి తెగించారు. పట్టపగలే టిప్పర్లు, పొక్లెయిన్లు తెచ్చుకొని చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నా రెవెన్యూ, నీటిపారుదల శాఖ (పీడబ్ల్యూడీ) అధికారులు నోరు మెదపడం లేదు. వైకాపాకు చెందిన గుత్తేదారు కావడంతో అధికారులు చేష్టలుడిగి కూర్చున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వరకు రాత్రి వేళల్లో యంత్రాలతో గుట్టుచప్పుడు కాకుండా తరలించిన వైకాపా గుత్తేదారు తమనెవరూ ప్రశ్నించక పోవడంతో శుక్రవారం పట్టపగలే మట్టి తరలింపునకు సాహసించారు.
కొన్ని రోజులుగా సాగుతున్న వ్యవహారం
మండలంలోని వినగడప దుర్గాదేవి చెరువు నుంచి కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో వైకాపాకు చెందిన గుత్తేదారు తన క్వారీకి చెందిన 2 పొక్లెయిన్లు, పదికిపైగా టిప్పర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. మొదట రహదారి మార్జిన్లకు పోసేందుకు ప్రారంభించి తర్వాత ఇతర ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టారు. చెరువులోని కొంత భాగంలో గ్రావెల్ లభ్యమైంది. ఇదే అదనుగా గుత్తేదారు తన నిర్మాణ పనుల అవసరాల మేరకు మట్టిని కొద్ది రోజులుగా అక్రమంగా బయటకు తరలిస్తున్నారు. పీడబ్ల్యూడీ అధికారులకు చెరువులపై అజమాయిషీ కొరవడింది. రెవెన్యూ అధికారులు తమకెందుకంటూ మిన్నకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ తరలింపును ఆపడానికి సాహసించలేకపోయారు. దుర్గాదేవి చెరువులో గ్రావెల్, మట్టి తవ్వకాలకు అధికారికంగా ఎలాంటి అనుమతులు లేవు. దుర్గాదేవి చెరువు తెలంగాణకు సరిహద్దులో ఉండటంతో బరి తెగించారు. శుక్రవారం పట్టపగలే యంత్రాలు, టిప్పర్లతో మట్టి తరలిస్తుండటంతో బయటపడింది. దాదాపు 8 నుంచి 10 అడుగుల లోతుతో 200 అడుగుల మేరకు పొడవు, వెడల్పుతో గుంతలు తీసి మట్టి, గ్రావెల్‌ను తరలించడం గమనార్హం.
* దీనిపై న్యూస్‌టుడే, పీడబ్ల్యూడీ ఏఈ వి.కిశోర్‌ను సంప్రదించగా మండలంలోని ఏ చెరువులోనూ మట్టి తరలింపునకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. దుర్గాదేవి చెరువులో మట్టి, గ్రావెల్ అక్రమంగా తీసుకెళుతున్న సంగతి తనకు తెలియదన్నారు. తహసీల్దారు బాలకృష్ణారెడ్డిని సంప్రదించగా మట్టి అక్రమంగా తరలిస్తే యంత్రాలు, వాహనాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు.
అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు
వినగడప, కొత్తపల్లికి చెందిన కొందరు వైకాపా నాయకులు, అధికారుల అండదండలతో వినగడప దుర్గాదేవి చెరువులో మట్టిని అధికార పార్టీకి చెందిన గుత్తేదారు అక్రమంగా తరలిస్తున్నారు. రేయింబవళ్లు చెరువులో పొక్లెయిన్లు, టిప్పర్లతో గ్రావెల్ తీసుకెళుతున్నా ఆయా శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకవేళ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారే అక్రమార్కులకు సమాచారం ఇచ్చి బయటకు రాకుండా చేస్తున్నారు. శుక్రవారం పట్టపగలే యంత్రాలు, లారీలు వినియోగించి వేలాది క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా పీడబ్ల్యూడీ, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. వారి అండదండలతోనే మట్టి మాఫియా చెలరేగిపోతున్నారన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్, మట్టిని అక్రమార్కులు చెరువు నుంచి బయటకు తరలించారు.
గువ్వల వెంకటేశ్వరరెడ్డి, తెదేపా సీనియర్ నాయకుడు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!